బంగారం @రూ.50వేలు

  • Publish Date - June 23, 2020 / 04:32 AM IST

ఆర్థిక అభద్రత కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగిపోతున్నాయి. సురక్షితమైన పెట్టుబడి కోసం ప్రజలు బంగారం, వెండిపై పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నారు. కరోనావైరస్ సంక్రమణ కారణంగా, ఆర్థిక కార్యకలాపాలు పెద్దగా జరగడం లేదు. అందువల్ల, ఆర్థిక అభద్రత ఉండడంతో బంగారంపై పెట్టుబడులు పెడుతుండగా.. ధరలు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే సోమవారం (జూన్ 23, 2020) ప్రారంభ వాణిజ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. రికార్డ్ క్రియేట్ చేసింది. వెండి కూడా అదే దారిలో పయనించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,580కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.46,290 పలికింది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి ధర రూ.48,800కు చేరుకుంది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.49,800కు పైగా పలికింది.

దేశరాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధర తో పోలిస్తే 240 రూపాయలు పెరిగి 47,000 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం ధర కంటే 230 రూపాయలు పెరగడంతో 48,190 రూపాయలకు చేరుకుంది.

హైదరాబాద్‌‌తో పాటు విజయవాడ సహా దశవ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో 10 గ్రాముల బంగారం ధర రూ.50,000 దాటింది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్లో రాత్రి 11 గంటల సమయంలో ఔన్స్ బంగారం 1,767 డాలర్లు, ఔన్స్ వెండి 18 డాలర్లకు పైగా ఉంది. ఔన్స్ అంటే 31.1 గ్రాములు. అంతకుముందు 1,779 డాలర్ల సమీపానికి కూడా చేరుకుంది. సోమవారం బంగారం అంతర్జాతీయ మార్కెట్లో 7 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.

Read: లీటరుకు రూ.9.21 పెరిగిన పెట్రోల్ ధర.. అసలెందుకు పెరుగుతున్నాయి..