×
Ad

గ్లోబల్‌ మార్కెట్‌లో ధనాధనా దూసుకెళ్లిన బంగారం ధర.. ఎన్నడూలేనంత పెరిగి..

చరిత్రలో మొట్టమొదటిసారి ఔన్స్‌(28.35 గ్రాములు)కు $5,000 (రూ.4,58,130) దాటింది.

Gold (Image Credit To Original Source)

  • గ్లోబల్‌ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో పెరుగుదల
  • మొట్టమొదటిసారి ఔన్స్‌ $5,000
  • ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఆందోళనల వల్లే

Gold: గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు సృష్టించింది. చరిత్రలో మొట్టమొదటిసారి ఔన్స్‌(28.35 గ్రాములు)కు $5,000 (రూ.4,58,130) దాటింది. గత ఏడాది పసిడి ధర 60%కి పైగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే రోజును కొనసాగించే అవకాశం ఉంది.

గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా, ఇతర నాటో దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఆందోళనలు ఎక్కువయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు మార్కెట్లను కలవరపెట్టాయి. చైనాతో కెనడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే 100% సుంకం విధిస్తామని హెచ్చరించారు.

అనిశ్చితి సమయంలో పెట్టుబడిదారులు ఆశ్రయించే సేఫ్ హేవన్ ఆస్తులుగా బంగారం, ఇతర విలువైన లోహాలు ఉంటాయి. శుక్రవారం వెండి ధర ఔన్స్‌కు $100 దాటింది. గత ఏడాది దాదాపు వెండి ధర 150% పెరిగిన విషయం తెలిసిందే.

అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన అమెరికా డాలర్, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఈ ఏడాది మళ్లీ వడ్డీ రేట్లు తగ్గిస్తారనే అంచనాలు కూడా బంగారం, వెండి డిమాండ్‌ను పెంచాయి.

Also Read: రిక్షాలో భార్యను కూర్చోబెట్టి 300 కి.మీ తీసుకెళ్లిన వృద్ధుడు.. ఎందుకో తెలిస్తే కన్నీరు అపుకోలేరు..

యుక్రెయిన్, గాజా యుద్ధాలు, వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలు కూడా బంగారం ధరను అమాంతం పెంచేశాయి. 2025లో బంగారం బ్లాక్‌బస్టర్ సంవత్సరాన్ని చూసిందని చెప్పుకోవాలి. 1979 తరువాత ఆ స్థాయిలో మళ్లీ 2025లో భారీ లాభం నమోదైంది. పెట్టుబడిదారులు భారీగా కొన్నారు.

ట్రంప్ సుంకాలతో పాటు కృత్రిమ మేధస్సు సంబంధిత షేర్లు అధిక విలువ వద్ద ఉన్నాయనే భయాలు మార్కెట్లను కలవరపెట్టడంతో బంగారం వరుసగా కొత్త రికార్డులు సాధించింది. వడ్డీ రేట్లు తగ్గుతాయని పెట్టుబడిదారులు భావించినప్పుడు కూడా ధర పెరుగుతుంది.

తక్కువ వడ్డీ రేట్లు బాండ్‌లాంటి పెట్టుబడులకు తక్కువ లాభాలను సూచిస్తాయి. అందువల్ల పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి ఆస్తుల వైపు చూస్తారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది ప్రధాన వడ్డీ రేటును 2 సార్లు తగ్గిస్తుందని అంచనాలు నెలకొన్నాయి.