TikTok Comeback
TikTok Comeback : నాలుగు ఐదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ మళ్లీ భారత్‌కు తిరిగిరాబోతుందా? ఇప్పుడు ఈ యాప్ గురించే భారీగా (TikTok Comeback) ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాస్తవానికి, ఈ పాపులర్ టిక్‌టాక్ 2020 నుంచి భారత్‌లో బ్యాన్ అయిన సంగతి తెలిసిందే.
కానీ, ఇప్పుడు మళ్లీ భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని ఇటీవల కొంతమంది వినియోగదారులకు వెబ్‌సైట్ కూడా అందుబాటులోకి వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే, కంపెనీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ నేపథ్యంలోనే చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను అన్‌బ్లాక్ చేసేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఓ నివేదిక వెల్లడించింది. కొంతమంది వినియోగదారులు డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేశారని, భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలకు దారితీసింది. దీనిపై “భారత ప్రభుత్వం టిక్‌టాక్ కోసం ఎలాంటి అన్‌బ్లాక్ ఆర్డర్ జారీ చేయలేదు. ప్రకటనలు, వార్తలు పూర్తిగా నిరాధారం. తప్పుదారి పట్టించేలా ఉన్నాయి’’ అని పేర్కొంది.
భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాల నేపథ్యంలో టిక్‌టాక్ పునరాగమనంపై చర్చ మొదలైంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇటీవలే భారత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లను కలిశారు. SCO శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని మోదీ ఈ నెల చివరిలో చైనాను సందర్శించే అవకాశం ఉంది.
దాంతో చైనా యాప్స్ భారత మార్కెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాయనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అసలు విషయం ఏమిటంటే.. భారత ప్రభుత్వం, కంపెనీ టిక్‌టాక్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. నిషేధం ఇప్పటికీ ఇంకా అమలులోనే ఉంది. అధికారిక అనుమతులు లేకుండా యాప్ భారత మార్కెట్లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించలేదు.
లడఖ్‌లోని గల్వాన్ లోయలో సరిహద్దు ఘర్షణల తరువాత జూన్ 2020లో టిక్‌టాక్ సహా 58 ఇతర చైనీస్ యాప్‌లను నిషేధించారు. దేశ ‘సార్వభౌమాధికారం, సమగ్రత’కు ముప్పుగా భారత ప్రభుత్వం పేర్కొంది.
వీచాట్, వీబో, క్లాష్ ఆఫ్ కింగ్స్, కామ్‌స్కానర్ వంటి యాప్స్ ముందుగా నిషేధించగా, ఆ తరువాత ఇతర చైనా సంబంధిత యాప్స్ అన్నింటిని నిషేధించింది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) యూజర్ల డేటాను దుర్వినియోగం చేయడం, భారత్ వెలుపల సర్వర్‌లకు ట్రాన్స్‌ఫర్ చేయడం వంటివి అనేక ఫిర్యాదులు అందాయని పేర్కొంది.
“భారత జాతీయ భద్రత, రక్షణకు విరుద్ధమైన అంశాలతో ఈ డేటాను సేకరించడం, మైనింగ్ మరియు ప్రొఫైలింగ్ చేయడం, భారత సార్వభౌమత్వం, సమగ్రతను దెబ్బతీస్తుంది. ఇలాంటి వాటిపై అత్యవసర చర్యలు అవసరం” అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.
టిక్‌టాక్ బ్యాన్ అయినప్పుడు భారత్‌లో ఈ యాప్‌కు 120 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. బ్యాన్ తర్వాత యూజర్ల భద్రత కోసం అధికారులతో సహకరించాలని భావిస్తున్నట్టు టిక్‌టాక్ ఇటీవలే ప్రకటించింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.