e-commerce Platforms
e-commerce Platforms : ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలకు బిగ్ షాక్.. క్యాష్-ఆన్-డెలివరీ (COD) ఆర్డర్‌లపై అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్ర ప్రభుత్వం అధికారిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అక్టోబర్ 3న (e-commerce Platforms) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ-కామర్స్ రంగంలో పారదర్శకత న్యాయమైన పద్ధతుల కోసం తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
వినియోగదారుల ఫిర్యాదులతో దర్యాప్తు :
కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు సీఈడీ (COD) ఆర్డర్‌లపై అదనంగా రుసుము వసూలు చేస్తున్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. జూలై 2024లో కొంతమంది జెప్టో వినియోగదారులు సోషల్ మీడియాలో ఈ సమస్యను హైలైట్ చేశారు. స్పష్టమైన సమాచారం లేకుండా చెక్అవుట్ వద్ద అదనపు ఛార్జీలు విధిస్తున్నారంటూ ఆరోపించారు. జెప్టో ఒక్కటే సమస్య కాదు.. అనేక ఆన్‌లైన్ పోర్టల్‌లు కస్టమర్ల నుంచి ఇలాంటి రుసుములను వసూలు చేస్తున్నాయి. ఇలాంటి ఫిర్యాదుల తర్వాత కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు :
వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జోషి పేర్కొన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ రంగంలో పారదర్శకత, న్యాయమైన పద్ధతులను నిర్ధారించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
మోసపూరిత పద్ధతులపై ముఖ్యంగా ఆన్‌లైన్ కమర్షియల్ ప్లాట్‌ఫాంలపై ఫిర్యాదులు అందిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ దిశగా చర్య తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఆర్డర్లపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ వినియోగదారుల ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
గత జూలైలో ఇలాంటిదే ఒకటి వెలుగులోకి వచ్చింది. చెక్‌పాయింట్‌లో ప్లాట్‌ఫామ్ అదనపు ఛార్జీలు విధిస్తుందని ఆరోపిస్తూ జెప్టో వినియోగదారులు సోషల్ మీడియాలో ఈ మెథడ్ గురించి పోస్ట్ చేశారు. భారత చట్టం ప్రకారం గుర్తించిన 13 డార్క్ ప్యాటర్న్‌లలో ఇదొకటి. ఈ పద్ధతిని సమగ్రంగా పరిశోధించడం అవసరమని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ-కామర్స్ కంపెనీలు తమకు ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా డార్క్ ప్యాటర్న్‌లతో కస్టమర్ తప్పుదారి పట్టిస్తాయి.
కస్టమర్లను ఇలా ట్రాప్ చేస్తారు :
బ్రైట్ కలర్ ప్యాటర్న్ చూసేందుకు ఆకర్షణగా ఉంటాయి. లాంగ్వేజీ కూడా గందరగోళంగా ఉంటుంది. యూజర్ క్లిక్ చేయకముందే ఆటో సెట్టింగ్స్ ఉంటాయి. వినియోగదారులు ఈ ట్రిక్స్ చూడగానే అట్రాక్ట్ అవుతారు. ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. వ్యక్తిగత డేటాను షేర్ చేస్తారు. అర్థంకానీ నిబంధనలను అంగీకరించడం చేస్తారు. ఉదాహరణకు.. ఇ-కామర్స్ కంపెనీలు తరచుగా డెలివరీ ఫీజులను చివరి వరకు హైడ్ చేస్తాయి. అంటే యూజర్ ప్రమేయం లేకుండానే చెక్ బాక్స్ ముందే సెలెక్ట్ అయి ఉంటుంది. కొన్నిసార్లు ‘Single item Left’ అనే మెసేజ్ కూడా చూపిస్తుంది.
The Department of Consumer Affairs has received complaints against e-commerce platforms charging extra for Cash-on-Delivery, a practice classified as a dark pattern that misleads and exploits consumers.
A detailed investigation has been initiated and steps are being taken to… https://t.co/gEf5WClXJX
— Pralhad Joshi (@JoshiPralhad) October 3, 2025
డార్క్ ప్యాటర్న్ అంటే ఏంటి? :
డార్క్ ప్యాటర్న్‌లు అనేవి ఈ-కామర్స్ కంపెనీకి భారీగా బెనిఫిట్స్ అందించేవి. వినియోగదారులకు తెలియకుండా మోసగించేందుకు ఫ్రాడ్ డిజిటల్ డిజైన్‌లు అనమాట. ఈ ప్యాటర్న్‌లలో హిడెన్ ఛార్జీలు ఉంటాయి. ముందుగా టిక్ చేసి కాన్సెంట్ బాక్సులు, ఫేక్ “క్విక్” మెసేజ్‌లు, అర్ధంకాని భాష లేదా గందరగోళపరిచేలా సైట్ ఇంటర్‌ఫేస్‌లు ఉంటాయి.
2023 నవంబర్‌లో వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇలాంటి తరహా 13 డార్క్ ప్యాటర్న్‌లను గుర్తించింది. ఇందులో డ్రిప్ ధర నిర్ణయం, రాంగ్ ఎమర్జెన్సీ, ట్రిక్ క్వశ్చన్స్, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్‌లు కన్ఫర్మేషన్ షేమింగ్ వంటి ప్యాటర్న్‌లు ఉన్నాయి.
అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) 2024 నివేదిక ప్రకారం.. భారత మార్కెట్లో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన 53 యాప్‌లలో 52 యాప్‌లలో ఇదే మాదిరి డార్క్ ప్యాటర్న్‌ను ఉపయోగించాయి. ఇందులో ఇ-కామర్స్, ఫిన్‌టెక్, ఆన్‌లైన్ గేమింగ్ రంగాలు కూడా ఉన్నాయి. ఈ ట్రిక్స్ చాలా సైలెంటుగా జరుగుతాయి. అందుకే వినియోగదారులు హైడ్ ఇన్ ఛార్జీలు వసూలు చేయడంతో పాటు తప్పుదారి పట్టించినట్టుగా గ్రహించలేరని వినియోగదారుల సంస్థలు చెబుతున్నాయి.
ప్రభుత్వ చర్యలు, మార్గదర్శకాలు :
మే 28, 2024న కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఇ-కామర్స్ కంపెనీలతో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కంపెనీలు తమ డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లు, డార్క్ ప్యాటర్న్‌ల ఇంటర్నల్ ఆడిట్‌లను నిర్వహించాలని సూచించింది. ఆపై ఆడిట్ రిజల్ట్స్ కూడా బహిరంగపర్చాలని సూచించింది. 2023 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని పరిశ్రమ, ప్రభుత్వం ఉమ్మడి వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఫీజు ఇష్యూపై దర్యాప్తులో ఈ-కామర్స్ కంపెనీలు సకాలంలో ఫీజును వెల్లడించాయా లేదా చెక్అవుట్ ప్రాసెస్ పారదర్శకంగా ఉందా అనేది పరిశీలిస్తారు.
దర్యాప్తుతో రాబోయే మార్పులేంటి? :
ప్రభుత్వ దర్యాప్తులో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు దోషులుగా తేలితే.. వినియోగదారుల రక్షణ చట్టం కింద కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో జరిమానాలు, ఇంటర్‌ఫేస్ డిజైన్‌లో మార్పులు, అన్ని నియమాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సి రావచ్చు. ఎందుకంటే.. భారత మార్కెట్లో క్యాష్-ఆన్-డెలివరీ అనేది ముఖ్యంగా మెట్రో నగరాల వెలుపల ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. కేంద్రం దర్యాప్తుతో భవిష్యత్తులో ఈ-కామర్స్ కంపెనీలకు పారదర్శకత, వినియోగదారుల హక్కులపై సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.