Petrol Diesel Prices
ఈ20 పెట్రోల్ (ఇందులో 20 శాతం ఇథనాల్ ఉంటుంది)ను వాహనాల్లో పోయించుకుంటే మైలేజ్ తగ్గుతుందంటూ సామాజిక మాధ్యమాల ద్వారా చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “ఇందుకు సంబంధించిన సిద్ధాంతాలు ఇవే..”నంటూ పోస్టులు చేస్తున్నారు.
ఈ20 పెట్రోల్ మైలేజ్‌ను తీవ్రంగా తగ్గిస్తుందని, ముఖ్యంగా కారు వాడకంలో ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్‌కు కూడా హాని చేస్తుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
ఈ ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలు లేవని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంధన సామర్థ్యంపై ప్రభావం ఉన్నా అది స్వల్పంగా ఉంటుందని చెప్పింది. ఈ10 పెట్రోల్‌కు అనువుగా డిజైన్ చేసిన వాహనాలను ఈ20కి మార్చితే మైలేజ్ 1-2 శాతం మాత్రమే తగ్గవచ్చు. ఇతర వాహనాలలో 3-6 శాతం తగ్గుదల ఉండొచ్చు.
ఇంజిన్ ట్యూనింగ్ మెరుగుపరిచి, ఈ20కు అనుకూలమైన పార్టులు వాడితే దీన్ని తగ్గించవచ్చు. ఎప్‌రిల్ 2023 నుంచి మెరుగైన పార్టులతో కూడిన ఈ20కు అనుగుణ వాహనాలు అందుబాటులో ఉన్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ తెలిపింది.
ఈ20 పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్, సంబంధిత పార్టులను డ్యామేజ్ చేసే ప్రభావం ఉందంటూ వస్తున్న ప్రచారంపై కూడా పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. పాత వాహనాలలో 20,000 నుంచి 30,000 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చిన్నపాటి భాగాలు (రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లు) మార్చాల్సిన అవసరం ఉండొచ్చని తెలిపింది.
ఇవి తక్కువ ఖర్చుతో సాధారణ సర్వీసింగ్ సమయంలో మార్చుతారని పేర్కొంది. ఇథనాల్ వాడకం వల్ల కొత్త వాహనాలలో ఇంజిన్ పనితీరుతో పాడు రైడింగ్ క్వాలిటీ మెరుగవుతుంది అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ20 పెట్రోల్ ఎందుకు వాడాలి?
ఇథనాల్ అనేది పునరుత్పాదక ఇంధనం. చెరకు, మక్క నుంచి తయారవుతుంది. ఇది పెట్రోలుతో పోలిస్తే గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారం 65 శాతం, 50 శాతం తక్కువగా విడుదల చేస్తుందని అధ్యయనాలు తెలిపాయి.
అంటే పెట్రోల్, ఇథనాల్ 80:20 మిశ్రమం వల్ల CO2 ఉద్గారం తగ్గుతుంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపితే భారత్ ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించవచ్చు. దీనివల్ల దేశ ఇంధన భద్రత మెరుగవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
భారత్‌లో ఇథనాల్ ను మిగులు బియ్యం, పనికిరాని ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. 2014-15 నుంచి ఇప్పటివరకు ఇథనాల్ వల్ల రూ.1.4 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని భారత్ ఆదా చేసింది. రైతులకు రూ.1.2 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.