GST collection : దేశంలో అక్టోబర్ నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల మార్క్ దాటేసింది. ఫిబ్రవరి నుంచి భారీ మొత్తంలో జీఎస్టీ వసూళ్లు కావడం ఇదే తొలిసారి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 2020 ఒక నెలలోనే దేశీయ స్థూల వస్తు సేవల పన్ను (GST) ఆదాయం రూ.1,05,155 కోట్లు వసూలు అయ్యాయి.
అందులో CGST రూ.19,193 కోట్లు కాగా, SGST రూ.5,411 కోట్లు, IGST రూ. 52,540 కోట్లు, సెస్ రూ.8,011 కోట్లు వసూలు చేయగా.. మొత్తం కలిపి లక్ష కోట్లు దాటేసిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అక్టోబర్ 31, 2020 వరకు దాఖలైన GSTR-3B రిటర్న్స్ మొత్తం రూ.80 లక్షలుగా నమోదైంది. ఇందులో దిగుమతి వస్తువుల నుంచి వసూలు చేసిన జీఎస్టీ రూ.23,375 కోట్లుగా నమోదైందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
గత ఏడాదిలో ఇదే నెలలో రూ.95,379 కోట్లు జీఎస్టీ వసూళ్లు కంటే ఈసారి 10శాతం అత్యధికంగా వసూళ్లు అయ్యాయి. కరోనా లాక్ డౌన్ ఆంక్షలతో దేశీయ ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో జీఎస్టీ కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా పుంజుకుంటున్నాయి.