RBI Policy Rates October 2025: ద్రవ్యోల్బణం నెమ్మదిస్తోంది. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అక్టోబర్ 1న జరగబోయే సమావేశంలో పాలసీ రేట్లలో మార్పులు చేసే అవకాశం అంతగా లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కనబరుస్తుండటం, జీఎస్టీ తగ్గింపులతో పెరిగిన వినియోగం, అలాగే ఆహార ధరల పెరుగుదల భయాలు… వంటి కారణాలు అన్నీ ఆర్‌బీసీ వేచి చూసే ధోరణిని అవలంబించేలా చేస్తున్నాయి.
ఎందుకిలా?
భారత రిటైల్ ద్రవ్యోల్బణం (CPI) ఆగస్టులో 2.07%గా నమోదైంది. ఇది జూలైలోని 1.61%తో పోలిస్తే పెరిగినప్పటికీ, ఆర్‌బీఐ నిర్దేశించిన 2-6% పరిమితిలోనే ఉంది. సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ రేట్ల తగ్గింపులు ధరల ఒత్తిడిని మరింత తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ.. ఆర్‌బీఐ అంచనా వేసిన 3.1% కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 1.75% వద్ద ఉండొచ్చు. జీఎస్టీ తగ్గింపుల ప్రభావంతో అక్టోబర్‌లో ఇది 1% కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
వేగవంతమైన వృద్ధి: రేట్ల తగ్గింపునకు బ్రేక్?
ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, భారత్ సాధిస్తున్న బలమైన వృద్ధి ఆర్‌బీఐని పునరాలోచింపజేస్తోంది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 7.8% వృద్ధిని నమోదు చేసింది. ఈ గణాంకాలు ఆర్‌బీఐకి రేట్లను 25-50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, బలమైన జీడీపీ వృద్ధి, జీఎస్టీ తగ్గింపుల ద్వారా వినియోగం పెరుగుతుండటం వల్ల ప్రస్తుతానికి రేట్ల తగ్గింపు కష్టమే అని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆగస్టులో ద్రవ్యోల్బణం 2% దాటడం, అలాగే ఈ ఆర్థిక ఏడాది ఆరు నెలలు వృద్ధి అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే డిసెంబర్‌లో కూడా రేటు తగ్గింపు కష్టమే అని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.
ఆహార ధరలు, ప్రపంచ అనిశ్చితులే అసలైన సవాల్!
జీఎస్టీ సంస్కరణలు వినియోగదారు వ్యయానికి ఊతమిస్తాయని భావించినప్పటికీ, మరోవైపు కొత్త సవాళ్లు తలెత్తుతున్నాయి. ఉత్తర, మధ్య భారతదేశంలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ముప్పు, తద్వారా ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు ఈ ఆర్థిక ఏడాది రెండో భాగంలో వృద్ధికి అవరోధంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఆర్థిక ఏడాదిలో అద్భుతమైన వృద్ధి తర్వాత, రెండో భాగంలో వృద్ధి మందగించే అవకాశం ఉందని ఒక ఆర్థిక నిపుణుడు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ మూడో త్రైమాసికంలో మరో 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరో నిపుణుడు ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ, బలమైన జీడీపీ కారణంగా మార్కెట్లు ప్రస్తుతానికి రేట్ల తగ్గింపును పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
మొత్తంగా, అక్టోబర్‌లో వినియోగదారు వ్యయాలు వేచి చూసే ధోరణిని అవలంబించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నా, వృద్ధి బలంగా ఉండడంతో ఆర్‌బీఐ పాలసీ రేట్లను స్థిరంగా ఉంచవచ్చు. భవిష్యత్ నిర్ణయాలు ఆహార ద్రవ్యోల్బణం, జీఎస్టీ తగ్గింపుల ప్రభావం, అలాగే ప్రపంచ పరిణామాలు భారత వృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయో అనే అంశాలపై ఆధారపడి ఉంటాయి.