how you can pay zero tax
New Tax Regime : 2025 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించి అనేక కీలక మార్పులను తీసుకొచ్చింది. మధ్యతరగతితో పాటు వేతన జీవులకు భారీ ఊరట అందించింది. కొత్త పన్నువిధానం ప్రకారం.. రూ.12 లక్షల ఆదాయం వచ్చినా కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.
అదే మీరు ఉద్యోగులైతే మాత్రం అదనంగా స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు పొందొచ్చు. దాంతో మీరు మొత్తంగా రూ. 12,75,000 ఆదాయం వరకు ఎలాంటి పన్నుభారం ఉండదు. అయితే, ఈ ప్రయోజనం కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. అందుకే, మీకు రూ.13.7 లక్షల వరకు ఆదాయం వచ్చినా కూడా జీరో ట్యాక్స్ ఎలా చెల్లించవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కొత్త పన్ను విధానం ప్రకారం.. సుమారు అన్ని రకాల డిడక్షన్లను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అకౌంట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు చేసే కంట్రిబ్యూషన్‌పై మాత్రం పన్ను మినహాయింపు అందిస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే ఎస్పీఎస్ కంట్రిబ్యూషన్‌పైనే సెక్షన్ 80CCD (2) కింద ట్యాక్స్ డిడక్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అదే ఉద్యోగి సొంతంగా ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ డిడక్షన్స్ పొందడానికి వీలుండదు. కంపెనీలు అందించే ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్ ఉద్యోగుల గ్రాస్ శాలరీలోనే ఉంటుంది. అందుకే, ఈ అమౌంట్‌పై తప్పకుండా పన్ను పడుతుందని పన్నుచెల్లింపుదారులు గమనించాలి.
అసలు ట్యాక్స్ డిడక్షన్స్ ఎలా వర్తిస్తుందంటే? :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్‌పై సెక్షన్ 80CCD (2) కింద ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ క్లెయిమ్ అమౌంట్ సంబంధిత ఉద్యోగి బేసిక్ శాలరీలో 14 శాతానికి మించి ఉండకూడదు అనేది గుర్తించుకోవాలి. ఒక ఉద్యోగి వార్షిక వేతనం రూ.16 లక్షలుగా ఉంటే.. ఇందులో 50 శాతం బేసిక్ శాలరీ అయితే రూ.8 లక్షల్లో గరిష్టంగా 14 శాతం అనగా రూ.1.12 లక్షల వరకు మాత్రమే ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
పాత పన్ను విధానం ప్రకారం.. బేసిక్ శాలరీలో 10 శాతం వరకు మాత్రమే ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. ఉద్యోగులకు అందించే పీఎఫ్, ఎస్పీఎస్, సూపర్యాన్యుషన్ మొత్తం కలిపి రూ.7 లక్షల 50వేలు దాటితే ఈ పరిమితి మించిన ఆదాయంపై కంపెనీలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిమితి లోపు అమౌంట్ తమ వ్యాపార ఖర్చులుగా చూపించాల్సి ఉంటుంది. అప్పుడే ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
ఉదాహరణకు.. ఒక ప్రైవేట్ ఉద్యోగికి ఏడాదికి రూ.13.7 లక్షల వార్షిక ఆదాయం వస్తుంటే.. అతడి బేసిక్ శాలరీ 50 శాతంగా ఉంటే.. రూ.6.85 లక్షలుగా అవుతుంది. అంటే.. ఆ ఉద్యోగి ఎన్‌పీఎస్ అకౌంట్‌కు ఎన్‌పీఎస్ (NPS) కంట్రిబ్యూషన్ కింద బేసిక్ శాలరీలో గరిష్టంగా 14శాతం వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. రూ.6.85 లక్షలలో 14 శాతం అంటే.. రూ.95,900 అనమాట.
అదే.. స్టాండర్డ్ డిడక్షన్ కింద అదనంగా రూ. 75 వేల వరకు మినహాయింపు కూడా పొందే వీలుంది. రూ.95,900 + రూ.75వేలు అనగా రూ.1,70,900 అవుతుంది. ఈ అమౌంట్‌ను రూ.13.70 లక్షల నుంచి తీసేస్తే రూ.11,99,100పై పన్ను లెక్కిస్తారు. దీనికి ట్యాక్స్ రిబేట్ కూడా కలిపితే రూ.12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ కట్టనవసరం లేదు అనమాట. ఆ ఉద్యోగి గరిష్టంగా రూ.13.70 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు.
వేతనాల వారీగా NPS డిడక్షన్ ఇలా :
వార్షిక జీతం : రూ. 13.7 లక్షలు
అంచనా వేసిన ప్రాథమిక జీతం (మొత్తంలో 50 శాతం): రూ. 6.85 లక్షలు
కంపెనీ NPS కాంట్రిబ్యూషన్ (రూ. 6.85 లక్షలలో 14శాతం): రూ. 95,900
స్టాండర్డ్ డిడక్షన్ : రూ. 75,000
మొత్తం తగ్గింపులు (NPS + స్టాండర్డ్ డిడక్షన్ ): రూ. 1,70,900
ఆదాయంపై పన్ను : రూ. 13.7 లక్షలు – రూ. 1,70,900 = రూ. 11,99,100
నికర పన్ను మొత్తం రూ. 12 లక్షల కన్నా తక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.