Household Gold Value ( Image Credit to Original Source )
Household Gold Value : బంగారం.. భారతీయులకు భారీ సెంటిమెంట్.. బంగారాన్ని సంప్రదాయ ఆభరణంగానే కాదు.. ఆస్తిగా కూడా భావిస్తుంటారు. అలాంటి బంగారం విలువ ఇప్పుడు అంచనాలకు మించి పోయింది. ప్రత్యేకించి భారతీయుల ఇళ్లలోని బంగారం విలువ చరిత్రలో ఎన్నడూ లేని స్థితికి చేరింది.
ఇటీవలి ఏళ్లలో బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. బంగారం విలువ అనేది అందరి అంచనాల కన్నా మించిపోయింది. నిపుణులు అంచనాల ప్రకారం.. భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 30వేల టన్నుల బంగారం ఉంది.
ప్రస్తుత బంగారం ధరల ప్రకారం పరిశీలిస్తే పసిడి విలువ సుమారు 5 ట్రిలియన్ డాలర్లు. అంటే.. భారతీయ కరెన్సీలో రూ. 45,25,00,00,00,00,000 ( సుమారు రూ. 452 లక్షల కోట్లు). ఇది భారత్ ఒక ఏడాదిలో ఆర్జించే మొత్తం ఆదాయం (నామమాత్రపు జీడీపీ) కన్నా కూడా ఎక్కువ అనమాట.
IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ అక్టోబర్ 2025 ప్రకారం.. 2025–26 (మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరం) సంవత్సరానికి భారత నామమాత్రపు జీడీపీ 4.125 ట్రిలియన్లుగా అంచనా వేసింది. జీడీపీ అనేది ఏడాదిలో దేశం ఉత్పత్తి చేసే వస్తువులు, సేవల విలువను సూచిస్తుంది.
కానీ, భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం అనేది తరతరాలుగా దాచుకున్న సంపదగా ఉంటుంది. బంగారం ధరలు పెరిగితే ఈ సంపద విలువ కూడా పెరుగుతుంది. అదే తగ్గితే ఇంట్లో బంగారం విలువ కూడా తగ్గుతుంది. వాస్తవానికి, దేశంలో బంగారం ఎక్కువే అయినప్పటికీ, భారతీయుల చేతుల్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం ప్రపంచంలో మరెక్కడా కనిపించదనే చెప్పాలి.
భారతీయ ఇళ్లలో బంగారం విలువ భారీగా పెరగడానికి అసలు కారణం ఏంటంటే.. బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకడమే.. 2025 ఏడాదిలోనే బంగారం ధరలు దాదాపు 65 శాతానికి పెరిగాయి. మరో మాటలో చెప్పాలంటే.. డాలర్, ప్రభుత్వ బాండ్లపై నమ్మకం తగ్గిపోవడం ఒకటి అయితే.. పెద్ద దేశాల్లో ఆర్థిక ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం మరో కారణం.
అందులోనూ పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు సైతం బంగారాన్ని మళ్లీ ఆర్థిక భద్రతగా భావిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులకు తగినట్టుగా బంగారం విలువ కూడా అదే స్థాయిలో అంతకంతకూ పెరిగిపోతోంది.
దేశంలో ఇళ్లలో బంగారం కీలక పాత్ర :
భారతీయ ఇళ్లల్లో బంగారం ఎంతో కీలకం. ఈ బంగారాన్ని కేవలం పెట్టుబడిగా మాత్రమే కాదు.. భద్రతా భావాన్ని కూడా సూచిస్తుంది. పెళ్లిళ్లు, పండుగలు, కష్టకాలంలో అన్నిట్లోనూ బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బంగారం దాచుకుంటే అత్యవసర సమయాల్లో ఆదుకుంటుందనే భావన ఎక్కువగా ఉంటుంది.
కానీ నిపుణులు మాత్రం ఇంట్లో దాచుకునే బంగారంతో నేరుగా ఆదాయం పొందలేరని అంటున్నారు. బిజినెస్ లేదా ఉద్యోగాల్లా ఆర్థిక వృద్ధిని నడిపంచలేదని చెబుతున్నారు. దేశాభివృద్ధికి తోడ్పడదని, కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సంపదగానే చూస్తారని చెబుతున్నారు.
ప్రస్తుత రోజుల్లో బంగారంపై అభిప్రాయం నెమ్మదిగా మారుతోంది. చాలామంది భారతీయులు దాచిన బంగారాన్ని గోల్డ్ లోన్లు, గోల్డ్ బాండ్లు వంటి మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ బంగారం ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరుతోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం పరిశీలిస్తే.. గృహాల్లో దాచిన బంగారాన్ని క్రమంగా బ్యాంకింగ్, పెట్టుబడి మార్గాల్లోకి
తీసుకురావడం జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు వృద్ధికి అద్భుతంగా సాయపడుతుందని అంటున్నారు. బంగారం ఇంట్లో భద్రత కోసమే కాదు.. సరైన విధంగా వాడితే దేశ వృద్ధికి కూడా సాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
భారతీయ గృహస్థులకే కాదు.. బంగారంపై మమకారం ఆర్బీఐకి కూడా పెరిగింది. ప్రపంచమంతా ఆర్థిక అనిశ్చితిలో ఉండటంతో విదేశీ కేంద్ర బ్యాంకులు సైతం డాలర్‌పై పూర్తిగా ఆధారపడటం లేదు. తమ దేశాల్లో బంగారాన్ని భద్రంగా దాచుకుంటున్నాయి. బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటున్నాయి.
ఇతర దేశాల మాదిరిగా భారత్ కూడా బంగారంపై దృష్టిపెట్టింది. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా బంగారాన్ని భారీగా కొనేస్తోంది. గత 10 ఏళ్లలో ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం సుమారు 58శాతానికి పెరిగింది. దాంతో ఇప్పుడు దేశ విదేశీ మారక నిల్వల్లో పసిడి వాటా 17శాతానికి పైగా పెరిగింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారాన్ని భద్రత కోసం ఒకేచోట పెట్టకుండా ఆస్తులగా విడకొట్టడం.. పలుచోట్ల పెట్టుబడిగా పెట్టడం చేయాలని అంటున్నారు. ప్రస్తుతం భారత్ వద్ద దాదాపు 880 టన్నుల వరకు బంగారం ఉంది. ప్రపంచంలో టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది.
ప్రస్తుతానికి బంగారం అంతర్జాతీయ ధరల ప్రకారమే లెక్కిస్తున్నారు. ఫలితంగా రూపాయి విలువ తగ్గినా ప్రయోజనాలు వేరేగా ఉన్నాయి. దేశానికి కష్టకాలంలో ఆర్థిక స్థిరత్వం అందించగలదు. దేశీయ కరెన్సీపై నమ్మకాన్ని నిలబెట్టగలదు. ఇవన్నీ ఈ బంగారం నిల్వల వల్లే సాధ్యమంటే అతిశయోక్తి కాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే గృహస్థులకే కాదు బంగారం ఆర్బీఐ కూడా దేశ భద్రతా బీమా వంటిది అనమాట.
ప్రస్తుత రోజుల్లో బంగారం అనేది లాభం కోసం కొనడం లేదు.. కేవలం భద్రత కోసం కొంటున్న పరిస్థితి. సెంట్రల్ బ్యాంకులు సైతం బంగారాన్ని వడ్డీ లేదంటే రాబడి కోసమో దాచుకోవడం లేదు. బంగారం అంటే ఎప్పుడు అంటే అప్పుడు అమ్ముకునే సంపద. ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
కరెన్సీ విలువ క్షీణించినప్పుడు భద్రత కవచంగా నిలిచే సంపదగా చెప్పొచ్చు. అందుకే డాలర్‌పై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆంక్షల భయం అక్కర్లేదు. కరెన్సీ అస్థిరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ప్రతి ఏడాదిలో సుమారు వెయ్యి టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నేటి ప్రపంచంలో బంగారాన్ని కేవలం వాణిజ్యంగా మాత్రమే కాదు.. బంగారు నిల్వలను కూడా వైవిధ్యంగా ఉంచాలని అవసరం ఉందని అంటున్నారు. చమురు ధరల మాదిరిగా బంగారం కూడా ఇప్పుడు ప్రపంచ అనిశ్చితిని కొలిచే సూచికగా మారుతోంది. భారతీయ గృహాలైనా లేదా ఆర్బీఐ వంటి సెంట్రల్ బ్యాంకులకైనా ఈ పసిడి కేంద్రబిందువుగా మారుతోంది.