how telangana rise in real estate projects explained here
Telangana real estate: నగరాలు, పట్టణాలు వేగంగా డెవలప్ అవుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశంలో ఇళ్ల అమ్మకాల్లోనూ, లే అవుట్ల డెవలప్‌మెంట్‌లోనూ, ఆఫీస్ స్పేస్ అభివృద్ధిలోనూ హైదరాబాద్ వేగంగా వృద్ధి చెందుతోంది. జనాభా పెరుగుతుండటంతో విశ్వనగరంలో భారీగా నిర్మాణాలు చేపట్టాయి రియల్టీ సంస్థలు.
ప్రాపర్టీల కొనుగోలు తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసింది. 500 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులు, 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు డెవలప్ చేస్తే బిల్డర్లు తప్పని సరిగా ఆ ప్రాజెక్టును రెరాలో నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేయకుండా నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు చేపడితే రెరా చర్యలు తీసుకుంటుంది. దీంతో కొన్ని సంస్థలు మినహా అనేక సంస్థలు తమ ప్రాజెక్టులను రెరాలో నమోదు చేసుకుంటున్నాయి.
ఏపీతో పోలిస్తే తెలంగాణలో 4వేలకు పైగా ప్రాజెక్టులు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు టీఎస్ రెరా అధికారులు. ఇప్పటివరకు నిబంధనలకు అతిక్రమించిన సంస్థలకు దాదాపు 20 కోట్ల రూపాయల జరిమానా విధించారు. దీంతో వందలాది మంది కొనుగోలుదారులకు తాము న్యాయం చేసినట్లు టీఎస్ రెరా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో రెరాలో నమోదయ్యే ప్రాజెక్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత రెండేళ్ల కాలంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. గత రెండేళ్లలో తెలంగాణలో 8 వేల 227 ప్రాజెక్టులు రెరాలో నమోదు కాగా.. ఏపీలో మాత్రం 3 వేల 9 వందల ప్రాజెక్టులు నమోదయ్యాయి. అంటే ఏపీతో పోలిస్తే తెలంగాణలో 4 వేలకు పైగా ప్రాజెక్టులు అధికంగా నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో రియల్టీ రంగానికి అధిక డిమాండ్
ఇక రెరాలో ఎక్కువ ప్రాజెక్టులు నమోదు కావడానికి హైదరాబాద్‌లో రియల్టీ రంగానికి అధిక డిమాండ్ ఉండటమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దీనికితోడు బయ్యర్స్ సేఫ్టీ కోసం రెరా అమలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదని అధికారులు చెబుతున్నారు. తమకు వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వేగంగా స్పందిస్తున్నారు. అలాగే తమ వద్ద నమోదు కోసం వస్తున్న రియల్టీ సంస్థలకు అన్ని ఏర్పాట్లు చేశామని, దీంతో సులువుగా రెరాలో నమోదు అవుతున్నాయని వారు అంటున్నారు. దరఖాస్తు వచ్చిన తరువాత నెలరోజుల వరకు సమయం ఉన్నప్పటికీ.. వేగంగా అన్ని దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తున్నామన్నారు టీఎస్ రెరా చైర్మన్ సత్యనారాయణ. కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తున్నామన్నారు.
Also Read: హైదరాబాద్‌లో గణనీయంగా ఇళ్ల ధరల పెరుగుదల.. ఆలస్యం చేస్తే ఇంకా పెరుగుతాయ్!
ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా స్థిరాస్తుల అమ్మకాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. రెరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టుల్లో ప్రజలు ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావని టీఎస్ రెరా చెబుతోంది. అలాంటి పరిస్థితి వస్తే బయ్యర్స్‌కు చట్టపరమైన రక్షణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.