Gated Community Maintenance : బాబోయ్ హైదరాబాద్ లో బతకలేం.. మీ ఇంట్లో మీరు ఉన్నా పన్ను కట్టాల్సిందే..!
Hyd Gated Communities Maintenance : హైదరాబాద్ నగరంలో గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉండే వారికి కేంద్రం షాకిస్తుంది.
in Hyderabad gated community maintenance charges pushed into the 18 percent GST bracket
- గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే వారికి కేంద్రం షాక్
- మెయింటెనెన్స్ పెరిగితే 18 శాతం జీఎస్టీ
- ఆందోళన వ్యక్తం చేస్తోన్న నివాసితులు
HYD Gated Community Maintenance : హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే నివాసితులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. వీటిల్లో ఇల్లు తీసుకుంటే సకల సౌకర్యాలు అడుగు దూరంలోనే ఉంటాయని, పూర్తిస్థాయి భద్రత ఉంటుందని భావించి చాలామంది ఇక్కడే ఇళ్లు కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు ధనవంతులు మాత్రమే ఉండేవారు, ఇప్పుడు మధ్యతరగతి వారు కూడా గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంటి మెయింటెనెన్స్ (Maintenance) పై 18 శాతం జీఎస్టీ భారం విధిస్తుండటంపై హౌసింగ్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో ఇల్లు నిర్మించే ఖర్చు కన్నా, నిర్వహణ వ్యయమే ఎక్కువవుతోందని, కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీల్లో ఒక చదరపు అడుగుకి సుమారు 4 రూపాయల చొప్పున మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇంటికి నెలకు సుమారు 7,500 రూపాయలు మెయింటెనెన్స్ అవుతోంది. అయితే తాజాగా కేంద్రం ఈ మెయింటెనెన్స్ రూ. 7,500 దాటితే దాని మీద జీఎస్టీ విధిస్తోంది.
జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందంటే..
ఉదాహరణకు మీ సొసైటీ మీకు రూ. 7,499 మెయింటెనెన్స్ వసూలు చేస్తే, మీరు చెల్లించే జీఎస్టీ సున్నా రూపాయలు. కానీ, ఇదే మెయింటెనెన్స్ రూ. 7,501 వస్తే.. అప్పుడు మీరు కేవలం అదనపు రూపాయిపై మాత్రమే పన్ను చెల్లించరు, మొత్తం రూ. 7,501 పై 18 శాతం చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రతి ఒక్కరిపై దాదాపు రూ. 1,350 అదనపు భారం పడుతుంది.
కేంద్ర నిర్ణయంపై నగరంలోని గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇన్కమ్ టాక్స్, రోడ్ టాక్స్, ప్రాపర్టీ టాక్స్ కడుతున్నామని, సొంత ఇళ్లలో ఉంటూ తమ సెక్యూరిటీని, గార్డెన్‌ను తామే మెయింటైన్ చేసుకుంటుంటే మళ్లీ పన్ను ఎందుకు కట్టాలని వారు ప్రశ్నిస్తున్నారు. మధ్యతరగతి వారికి ఈ అదనపు భారం ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలు ఒక గ్రామంలా మారుతున్నాయని, అందులోని పార్కులు, జిమ్ములు, క్లబ్ హౌస్‌ల నిర్వహణ కోసం వెల్ఫేర్ అసోసియేషన్లు వసూలు చేసే మొత్తాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సరైనది కాదని వారు అంటున్నారు. దీనికి వ్యతిరేకంగా ‘మా కొద్దీ జీఎస్టీ’ అనే నినాదంతో హైదరాబాద్, సైబరాబాద్, తెల్లాపూర్ ప్రాంతాల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA) సంతకాల సేకరణ ప్రారంభించాయి. తమను లాభాపేక్ష లేని సంస్థలుగా గుర్తించాలని కోరుతూ సెంట్రల్ జీఎస్టీ విభాగానికి లేఖ రాశారు. ఈ సమస్యను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోనూ ఈ ఉద్యమాన్ని విస్తరిస్తున్నారు.
