Income Tax Returns
Income Tax Returns : ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట కల్పించింది. 2025-26మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను (ఐటీ) విభాగం ఐటీ రిటర్నుల గడువును పొడిగించింది. సెప్టెంబరు 15తోనే ఐటీ రిటర్నుల దాఖలుకు చివరి గడువు కాగా.. ఆదాయపు పన్ను విభాగం ఆ గడువును ఒకరోజు పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఆలస్యంగా ఈ ప్రకటన విడుదలైంది.
2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి గడువు తేదీని మొదట ఈ ఏడాది జూలై 31న గడువుగా నిర్ణయించారు. కానీ, మరళ ఆ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. అయితే, సోమవారం గడువు ముగుస్తుండటంతో చివరి నిమిషంలో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒకేసారి ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోర్టల్ పై ఒత్తిడి పెరిగి.. పలు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ ఐటీఆర్ఎస్‌లను దాఖలు చేయడానికి గడువును సెప్టెంబర్ 16వ తేదీ అంటే.. ఒకరోజు పొడిగిస్తూ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. జులై 31వ తేదీ నాటికి దాఖలు చేయాల్సిన ఐటీల దాఖలు గడువు తేదీని మరో రోజుకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
KIND ATTENTION TAXPAYERS!
The due date for filing of Income Tax Returns (ITRs) for AY 2025-26, originally due on 31st July 2025, was extended to 15th September 2025.
The Central Board of Direct Taxes has decided to further extend the due date for filing these ITRs for AY… pic.twitter.com/jrjgXZ5xUs
— Income Tax India (@IncomeTaxIndia) September 15, 2025
ఇదిలాఉంటే.. సెప్టెంబర్ 15వ తేదీ నాటికి దాదాపు 7.3కోట్లకు పైగా రిటర్నులు దాఖలైనట్లు.. ఇందులో 4కోట్లకు పైగా రిటర్నుల పరిశీలన పూర్తయినట్లు ఐటీ పోర్టల్ వెల్లడించింది.
సెప్టెంబర్ 16 తరువాత కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. 2025 డిసెంబర్ 31 వరకు ఐటీఆర్ సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. దీనికి కొన్ని షరతులు ఉంటాయి. సెక్షన్ 234ఎఫ్ ప్రకారం ఆలస్య రుసుము చెల్లించి రిటర్నులు చేయొచ్చు. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలలోపు ఉంటే రూ. వెయ్యి, అంతకు మించి ఉంటే రూ. 5వేలు అపరాధ రుసుము వర్తిస్తుంది. అదేవిధంగా సెక్షన్ 234ఏ ప్రకారం చెల్లించాల్సిన పన్నుపై నెలకు 1శాతం వడ్డీ విధిస్తారు.