Indian Railways : రైల్వే ప్రయాణికులకు బిగ్‌అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్.. ఆధార్ ధ్రువీకరణ ఉన్నవారికే..

Indian Railways : రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Indian Railways : రైల్వే ప్రయాణికులకు బిగ్‌అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్.. ఆధార్ ధ్రువీకరణ ఉన్నవారికే..

Indian Railways

Updated On : September 16, 2025 / 7:58 AM IST

Indian Railways : దేశవ్యాప్తంగా రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్‌కు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయనుంది. ప్రస్తుతం తత్కాల్‌ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉంది. వచ్చే నెల ప్రారంభం నుంచి ఈ విధానాన్ని జనరల్ కోటా టికెట్లకు కూడా రైల్వే శాఖ విస్తరించింది.

Also Read: సతీదేవి ఎడమ చెంప భాగం పడిన ప్రదేశం మాణిక్యాంబ ఆలయం.. దర్శన భాగ్యంతో వ్యాధులను తొలగించే అమ్మవారు

అక్టోబర్ 1వ తేదీ నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్‌కు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయించింది. అయితే, ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా, టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఐఆర్‌టీసీటీ వెబ్ సైట్, యాప్‌లలో టికెట్ పొందడానికి ఇదే వర్తిస్తుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

కొత్త నిబంధన ఏమిటి.. ఎలా పనిచేస్తుంది..
ఉదాహరణకు ప్రయాణికుడు నవంబర్ 15న న్యూఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే శివగంగా ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకోవాలని అనుకుంటే బుకింగ్స్ నిబంధనల ప్రకారం 60 రోజుల ముందు.. అంటే.. సెప్టెంబర్ 16న అర్ధరాత్రి 12.20 గంటలకు ఓపెన్ అవుతుంది. అర్థరాత్రి 12.20 నుంచి 12.35 గంటల మధ్య.. అంటే మొదటి 15 నిమిషాల పాటు కేవలం ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న ఐఆర్‌సీటీసీ యూజర్లు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలరు. ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఆ సమయంలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ కీలక సమయాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా నిజమైన ప్రయాణీకులకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పండుగలు, వివాహాల సీజన్లలో ప్రభావం..
దీపావళి, ఛత్ పూజ, హోలీ వంటి ప్రధాన పండుగలు, అలాగే వివాహ సీజన్లలో రైలు టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణం తేదీకి 60రోజుల ముందు బుకింగ్ విండో ఓపెన్ చేసినప్పుడు.. ఇది తత్కాల్ బుకింగ్ సమయంలో కనిపించే రద్దీ మాదిరిగానే జనరల్ బుకింగ్ ద్వారా టికెట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్న ప్రయాణికులలో తీవ్రమైన పోటీ నెలకొంటుంది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే టికెట్లు అయిపోతాయి. ఈ డిమాండ్ ను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు, ఏజెంట్లు మోసపూరిత పద్ధతుల్లో టికెట్లను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా అమలు చేయనున్న ఆధార్ ఆధారిత బుకింగ్ ప్రక్రియ ద్వారా ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని రైల్వే బోర్డు భావిస్తోంది. ఇప్పటికే 2025 జూలై నుంచి తత్కాల్ బుకింగ్ కు ఈ విధానం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో, ఇప్పుడు జనరల్ కోటాకు కూడా దీనిని అమలు చేయబోతుంది రైల్వే బోర్డు.

ప్రయాణీకులు ఏం చేయాలి..
కొత్త నిబంధన ప్రకారం.. ప్రయాణికులు అక్టోబర్ 1కి ముందే ఆధార్ నంబర్లను వారి ఐఆర్సీటీసీ ఖాతాలతో లింక్ చేయాలి. జనరల్ రిజర్వేషన్ బుకింగ్ విండో ప్రతీరోజూ అర్ధరాత్రి 12.20 నుంచి రాత్రి 11.45 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అయితే, కొత్త రూల్ కేవలం మొదటి 15 నిమిషాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా భారతదేశంలోని లక్షలాది మంది ప్రయాణీకులకు పారదర్శకమైన, ఎలాంటి మోసపూరిత విధానం లేకుండా టికెట్ల ప్రక్రియను అందించడమే లక్ష్యమని రైల్వే అధికారులు చెబుతున్నారు.