India Gold Reserves : ఫారెక్స్ విస్తరణ.. భారత్‌లో పెరుగుతున్న బంగారం నిల్వలు.. జనవరిలో బంగారం నిల్వ ఎంతంటే?

ఫారెక్స్ నిల్వలలో బంగారం విలువ మార్చి 22 నాటికి 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, 2023 మార్చి చివరి నాటికి ఉన్న విలువ కన్నా 6.287 బిలియన్ డాలర్లు ఎక్కువగా నమోదైంది.

India building up gold reserves as part of forex deployment_ RBI Guv Das

India Gold Reserves : ఫారెక్స్ విస్తరణలో భాగంగా భారత్ బంగారం నిల్వలను పెంచుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. సాంప్రదాయిక పోస్ట్ పాలసీ సమీక్ష విలేకరుల సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. ‘మా రిజర్వ్ నిల్వలో బంగారు నిల్వలను పెంచుతున్నాం’ అని పేర్కొన్నారు. బంగారం కొనుగోళ్లు ఎంత పరిమాణం అనే విషయాన్ని మాత్రం ఆయన రివీల్ చేయలేదు.

అయితే, బంగారం నిల్వల విలువలో పెరుగుదలను చూపే అధికారిక డేటాను మాత్రం సూచించారు. అధికారిక సమాచారం ప్రకారం.. ఫారెక్స్ నిల్వలలో బంగారం విలువ మార్చి 22 నాటికి 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, 2023 మార్చి చివరి నాటికి ఉన్న విలువ కన్నా 6.287 బిలియన్ డాలర్లు ఎక్కువగా నమోదైంది.

8.7 టన్నుల బంగారం కొనుగోలు.. రెండేళ్లలో ఇదే అత్యధికం :
ఇటీవలి నివేదిక ప్రకారం.. ఆర్బీఐ గత జనవరిలోనే 8.7 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇది రెండేళ్లలో అత్యధికం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ హోల్డింగ్‌లు జనవరి చివరి నాటికి 803.58 టన్నుల నుంచి 812.3 టన్నులకు చేరుకున్నాయి. గత కొన్ని నెలలుగా బంగారం ధర కూడా ర్యాలీని చూసింది. మార్చి 29 నాటికి మొత్తం ఫారెక్స్ నిల్వలు 645.6 బిలియన్ డాలర్ల ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని ఆర్బీఐ గవర్నర్ ముందు రోజునే ప్రకటించారు.

భారత్ నుంచి డాలర్ల ప్రవాహం పెరిగినా భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితులను నివారించడానికి గత నాలుగు-ఐదేళ్లలో ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడంపైనే ఆర్బీఐ దృష్టి సారించిందని చెప్పారు. ఫారెక్స్ నిల్వలో సెంట్రల్ బ్యాంక్ విధానం జాతీయ బ్యాలెన్స్ షీట్‌కు కూడా బలాన్ని చేకూరుస్తుందని ఆయన అన్నారు. స్థిరమైన రూపాయి మారకం విలువను కొనసాగించడమే రిజర్వ్ బ్యాంక్‌ ప్రాధాన్యతగా ఆర్బీఐ గవర్నర్ శక్తిదాస్ పేర్కొన్నారు.

Read Also : Gold Rate : బాబోయ్ బంగారం.. భారీగా పెరుగుతున్న ధరలు, ఎందుకిలా?