Myntra: పాత ప్రకటనతో కొత్త తలనొప్పి.. బాయ్‌కాట్ మింత్రా డిమాండ్!

పాతదైన ఓ అడ్వర్టైజ్‌మెంట్ మింత్రా కంపెనీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.

Myntra

Boycott Myntra: ‘రాత్రి గడిస్తే పగలుకు విషయం పాతదైపోద్ది’ అంటారు. కానీ పాతదైన ఓ అడ్వర్టైజ్‌మెంట్ మింత్రా కంపెనీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అటువంటి ఇబ్బందే మింత్రా కంపెనీకి కూడా వచ్చింది. ఐదేళ్ల క్రితం చేసిన ఓ పోస్టర్ మింత్రా మార్కెట్‌ను ప్రభావితం చేయడం ప్రారంభించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేట్లుగా ఉన్న పోస్టర్ కారణంగా, #BoycottMyntra మరియు #UninstallMyntra అనే హ్యాష్ ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి.

మింత్రా ఆ పోస్టర్‌ను ఆగస్టు 2016లో తయారు చేసింది. ఆ పోస్టర్‌లో మహాభారతంలో కీలకమైన పాత్రైన ద్రౌపది వస్త్రాపహరణంకు సంబంధించి, హిందూ వ్యతిరేక పోస్టర్ తయారుచేశారు. ఈ పోస్టర్‌లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుండగా.. కృష్ణుడు చిరను అందిస్తాడు. ఈ సమయంలో ఎక్స్‌ట్రా చీర కోసం కృష్ణుడు మింత్రాలో ఎక్స్‌ట్రా లాంగ్ శారీస్ అంటూ సెర్చ్ చేస్తాడు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణం అయ్యింది. వాస్తవానికి ఐదేళ్ల క్రితం ఒక ఏజెంట్ స్క్రోల్‌డ్రోల్ మింత్రా కోసం ప్రకటన క్రియేట్ చేసింది.

భారతీయ నెటిజన్లు ఇప్పుడు ఈ అడ్వర్టైజ్‌మెంట్‌నే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మనోభావాలు దెబ్బతిన్నట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ యూజర్లు మింత్రాను “బాయ్‌కాట్ మింత్రా”, అన్‌ఇన్‌స్టాల్ మింత్రా అంటూ ట్రెండ్‌ చేస్తున్నారు. మహాభారతాన్ని, హిందూ మతాన్ని అవమానించడమే మింత్రా ఉద్ధేశ్యమని అభిప్రాయపడుతున్నారు. స్క్రోల్‌డ్రోల్ ఈ పోస్టర్‌ను ఫిబ్రవరి 2016లో తయారు చేసింది.

మరోవైపు, మింత్రా ఈ ప్రకటనపై క్లారిటీ ఇచ్చేసింది. సదరు యాడ్‌కి మాకు సంబంధం లేదని, థర్డ్ పార్టీ స్క్రోల్ సృష్టించి చేసిన పోస్ట్‌కు మేం కారణం కాదని అభిప్రాయపడింది. మింత్రాకు, దీనికి ఎటువంటి సంబంధం లేదని, మా బ్రాండ్‌ని ఉపయోగించినందుకు స్క్రోల్‌డోల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. ఇదే విషయమై స్క్రోల్‌డ్రోల్ కూడా క్షమాపణలు చెప్పింది.

గతంలో కూడా మింత్రా లోగో అమ్మాయిలను అవమానపరిచేలా ఉందంటూ విమర్శలు రాగా.. సదరు కంపెనీ లోగోను కూడా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.