Gold: భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు.. మరి పసిడి ధరల సంగతేంటి?

ఎందుకిలా జరుగుతుందన్న విషయాన్ని నిపుణులు వివరించారు.

గోల్డ్ వాడటంలో ఇండియా ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. అలాంటి భారతదేశంలో బంగారు దిగుమతులు ఫిబ్రవరిలో 85 శాతం తగ్గి కేవలం 15 మెట్రిక్ టన్నులకు పరిమితం కానున్నాయని విశ్లేషకులు చెప్పారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 103 టన్నుల బంగారం దిగుమతి అయింది.

గడిచిన 20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనివిధంగా కనిష్ఠ స్థాయికి దిగుమతులు చేరుకున్నాయి. బంగారం ధరలు విపరీతంగా పెరగడం వలన బంగారం దిగుమతులు తగ్గిపోతున్నాయని ఆర్థిక నిపుణులు, బ్యాంకు అధికారులు ప్రముఖ వెబ్‌సైట్ రాయిటర్స్‌కు తెలిపారు.

బంగారు దిగుమతులు తగ్గుతూ ఉండడం వల్ల భారత వాణిజ్య లోటు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి విలువను కొంతమేరకు పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. వచ్చే 2-3 రోజుల్లో ధరలు తగ్గకపోతే, బంగారాన్ని దిగుమతి చేసుకునే సంఖ్య తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాతో తెలిపారు.

Also Read: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. దేశంలో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

గత నెల కొన్న బంగారం స్టాక్ అలాగే ఉంది.. ఇంకా అమ్ముడు పోలేదు. తెచ్చుకున్న బంగారం అలాగే నిల్వ ఉండడం వలన ఈ నెలలో దిగుమతి చేసుకోవడం తగ్గిందని ముంబైకి చెందిన ఓ బ్యాంకు బులియన్ విభాగం అధిపతి తెలిపారు. భారతదేశంలో గత వారం 10 గ్రాముల బంగారం ధర 86,592 రూపాయలకు గరిష్ఠ స్థాయిని చేరుకున్న విషయం తెలిసిందే.

భారత్ మార్కెట్ డిస్కౌంట్‌ ఆఫర్లతో ట్రేడ్ అవుతుండడంతో బ్యాంకులు నిల్వ ఉన్న బంగారాన్నితిరిగి యునైటెడ్ స్టేట్స్‌కు తరలించామని ముంబైకి చెందిన ఓ బులియన్ వ్యాపారి చెప్పారు. అంతేగాక అమెరికా మార్కెట్ దాదాపు 1% ప్రీమియం ఆఫర్ చేస్తుంటే, ఇక్కడ భారతదేశంలోమాత్రం డిస్కౌంట్‌లో అమ్మడం లాభదాయకం కాదని అన్నారు.

ఇండియాలో ఇప్పుడు పెళ్లిల సీజన్ ఉంది. ఈ టైమ్‌లో బంగారం ధరలు ఆశించినంత తగ్గకుండా పెరిగితే కష్టమే. ఎంతలేదన్నా కొనుగోళ్లు 40% తగ్గి వేరే ఇతర రంగంలో లాభదాయకమైన పెట్టుబడి పెట్టి ఆ ఆస్తిని పెళ్లిళ్లలో బంగారానికి బదులుగా బహుమతి రూపంలో ఇస్తారని నిపుణులు అంటున్నారు. అలాగే, జ్యుయెలరీ రంగంపై ఆధారపడిన సంస్థలకు గడ్డుకాలం తప్పదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.