Gold: వామ్మో.. భారత్‌లో బంగారం, వెండి దిగుమతులు ఎంతగా పెరిగాయంటే? 

గత డేటాలో పేర్కొన్న వివరాలను సవరించారు.

భారత బంగారం, వెండి దిగుమతుల గురించి గతంలో ఓ రిపోర్టులో వెల్లడించిన దానికంటే.. దిగుమతులు ఎక్కువగా ఉన్నట్లు ఓ డేటా ద్వారా స్పష్టమైంది. 2024 ఏడాదిలో భారత్ మొత్తం దిగుమతి చేసుకున్న బంగారం, వెండి విలువ అంతకుముందు వెల్లడించిన డేటాలోని బిల్లు కంటే ఈ సవరించిన డేటాలో రూ.61 వేల కోట్లు అధికంగా ఉంది.

భారత్‌ అనుకున్నదానికంటే ఇతర దేశాల నుంచి బంగారం, వెండిని కొనడానికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సవరించిన డేటా ప్రకారం.. 2024లో బంగారం దిగుమతులు 12 శాతం (87.72 టన్నులు), వెండి దిగుమతులు 10 శాతం (692.77 టన్నులు) మేర పెరిగాయి.

భారత్ బంగారు దిగుమతులు 2024లో మొత్తం 812.22 టన్నులని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంచనా వేసి చెప్పింది. అంతకుముందు ఏడాది భారత దిగుమతులు 724.50 టన్నులుగా ఉన్నాయి.

వెండి దిగుమతులు 6,976.63 టన్నుల (2023లో) నుంచి 7,669.40 టన్నులకు (2024లో) పెరిగాయి. అయితే, 2022లో భారత్‌ రికార్డు స్థాయిలో 9,534.41 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. 2023లో కాస్త దిగుమతులను తగ్గించి, 2024లో మళ్లీ పెంచింది.

Also Read: ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతలుగా భారత్‌లో అడుగుపెట్టిన క్రికెటర్లు.. రోహిత్‌ చుట్టూ చేసి ఫ్యాన్స్‌ ఏం చేశారో చూడండి..

గత ఏడాది జూలై నుంచి అక్టోబర్ వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే.. గత ఏడాది జూలైలో జరిగిన భారత బంగారం దిగుమతులు 36.34 టన్నులని మొదట చెప్పారు. అయితే, ఇప్పుడు సవరించిన డేటా ప్రకారం 11.38 టన్నులు పెంచి, మొత్తం 47.72 టన్నులుగా దాన్ని పేర్కొన్నారు.

ఆగస్టులో బంగారు దిగుమతులను మొదట్లో 117.97 టన్నులుగా పేర్కొన్నారు. ఇప్పుడు దాన్ని 57.44 టన్నులు పెంచి, మొత్తం 175.41 టన్నులుగా అంచనా వేశారు. అలాగే, సెప్టెంబరులో 16.18 టన్నులు పెంచి మొత్తం దిగుమతి చేసుకున్న బంగారం 61.90 టన్నులని, అక్టోబర్‌లో 2.72 టన్నులు పెంచి మొత్తం దిగుమతి చేసుకున్న బంగారం 60.64 టన్నులని చెప్పారు.

అలాగే, జూలై నుంచి అక్టోబర్ వరకు భారత్ వెండి దిగుమతుల డేటాను కూడా సవరించారు.

  • గత డేటాలో పేర్కొన్న దానికంటే జూలైలో చేసుకున్న దిగుమతులను 865 కిలోలు పెంచి మొత్తం 103.31 టన్నులుగా తాజా డేటాలో పేర్కొన్నారు.
  • గత డేటాలో పేర్కొన్న దానికంటే ఆగస్టులో చేసుకున్న దిగుమతులను 65.69 టన్నులు పెంచి మొత్తం దిగుమతులు 103.31 టన్నులుగా లెక్కగట్టారు.
  • సెప్టెంబర్‌లో పేర్కొన్న మొత్తం దిగుమతులపై ఇచ్చిన లెక్కలకు మరో 292.72 టన్నులను కలిపి దిగుమతి చేసుకున్న మొత్తం వెండి 594 టన్నులని చెప్పారు.
  • అక్టోబర్‌లో పేర్కొన్న మొత్తం వెండి దిగుమతుల లెక్కలకు మరో 333.49 టన్నుల కలిపి మొత్తం దిగుమతి చేసుకున్న వెండి 469.16 టన్నులుగా సవరించిన డేటాలో పేర్కొన్నారు.