భారతీయ ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2019లో భారతదేశంలోని ఉద్యోగులు రెండెంకల జీతాన్ని అందుకోనున్నారని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కార్న్ ఫెర్రీ రిపోర్ట్ అంచనా వేసింది. ఆర్థికవ్యవస్థలో వేగంగా జరుగుతున్న వృద్దే దీనికి కారణమని తెలిపింది. 2018లో జీతాల పెరుగుదల 9శాతం ఉండగా ఈ ఏడాది భారతీయ ఉద్యోగుల శాలరీలు 10శాతం పెరిగే అవకాశముందని, కానీ పెరిగే ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే వాస్తవంగా పెరిగే వేతనం 5శాతంగా ఉండవచ్చని ఆ రిపోర్ట్ తెలిపింది. గతేడాది వాస్తవ వేతన పెరుగుదల 4.7శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో శరవేగంగా వృద్ది జరుగుతున్న కారణంగా భారత్ లో జీతాల పెరుగుదల అత్యధికంగా ఉంటోందని, వాస్తవ వేతన వృద్ది ఆసియాలోనే అత్యధికంగా ఉందని కార్న్ ఫెర్రీ ఇండియా చైర్మన్, రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్ నీత్ సింగ్ తెలిపారు.
ఆటోమేషన్ పెరుగుదల, టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించుకోవడం, సిల్క్స్ ఉన్నవారికి డిమాండ్ పెరుగుతున్న సమయంలో కంపెనీలు వ్యాపార వ్యూహాల్లో మార్పులు, చేర్పులకు చర్యలు తీసుకోవాలన్నారు.వేతనాల పెరుగుదల విషయానికొస్తే..ఆసియాలో గత ఏడాది 5.4 శాతం నుంచి ఈ ఏడాది 5.6 శాతం వరకు పెరుగవచ్చు. ద్రవ్యోల్బణ సర్దుబాటు తర్వాత వాస్తవ వేతన పెరుగుదల 2.6 శాతం ఉండవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అయితే గతేడాది 2.8శాతంతో పోల్చితే మాత్రం తక్కువే.
చైనాలో వాస్తవ వేతన పెరుగుదల అంచనా 3.2శాతం, , సింగపూర్ లో 3శాతం, ఇండోనేషియాలో 3.7శాతం, జపాన్ లో 0.1శాతంగా ఉండనుంది.
కార్న్ ఫెర్రీ రిపోర్ట్ ప్రకారం.. 2019లో తూర్పు యూరప్ లోని ఉద్యోగుల వేతనాల సగటు పెరుగుదల 6.6శాతంగా ఉండనుంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొంటే వాస్తవ వేతన పెరుగుదల 2.0శాతం ఉండే అవకాశముంది. బ్రిటన్ లో వాస్తవ వేతనాలు 0.6శాతం పెరిగే అవకాశముందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా వాస్తవ వేతన పెరుగుదలలో కోత ఉండే అవకాశముంది.