Major Financial Changes
Major Financial Changes : వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. బ్యాంకింగ్, పన్నులు, ట్రేడింగ్ కార్యకలాపాలలో అనేక ముఖ్యమైన (Major Financial Changes) మార్పులు జరగనున్నాయి. ప్రధానంగా వినియోగదారులు, వ్యాపారాలు, పెట్టుబడిదారులపై ప్రభావితం చేయనున్నాయి.
ఇందులో క్రెడిట్ కార్డు కొత్త నిబంధనల దగ్గర నుంచి కొత్త యూపీఐ రూల్స్, ట్రేడింగ్ గంటలు పొడిగింపు, మానిటరీ పాలసీ అప్‌డేట్స్, ఇంధన ధరలు, పార్లమెంటులో బిల్లులు, ఎస్బీఐ కార్డు ఇన్సూరెన్స్ కవరేజీ తొలగింపు వరకు మీ ఆర్థిక లావాదేవీల విషయంలో జరగబోయే మార్పులకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త UPI రూల్స్ అమల్లోకి :
యూపీఐ లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. బ్యాలెన్స్ చెకింగ్స్ (యాప్‌కు 50 సార్లు), లావాదేవీ స్టేటస్ చెకింగ్స్, (90-సెకన్ల వ్యవధిలో 3 సార్లు), లింక్డ్ అకౌంట్ ఎంక్వైరీలు (యాప్‌కు 25 సార్లు) వంటి వివిధ కార్యకలాపాలకు రోజువారీ పరిమితులు విధించింది.
ఆటో-పే ఫీచర్లు రద్దీ లేని సమయాల్లో మాత్రమే పనిచేస్తాయి. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9:30 తర్వాత ఇలా ఉంటాయి. అదనంగా, యూపీఐ యూజర్లు ఇప్పుడు పేమెంట్ చేసే ముందు లబ్ధిదారుడి రిజిస్టర్డ్ బ్యాంక్ పేరును చూడవచ్చు. లావాదేవీ లోపాలు, మోసాలను తగ్గించేందుకు ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
రెపో మార్కెట్ ట్రేడింగ్ గంటలు పొడిగింపు :
ఆగస్టు 1 నుంచి మార్కెట్ రెపో, ట్రై-పార్టీ రెపో (TREP) కార్యకలాపాల ట్రేడింగ్ విండో ఒక గంట పొడిగించారు. సవరించిన ట్రేడింగ్ సమయం ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. జూలైలో సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కాల్ మనీ ట్రేడింగ్ గంటలు పొడిగించారు. ప్రభుత్వ సెక్యూరిటీలు, ఫారెక్స్ వంటి ఇతర ఆర్థిక మార్కెట్ల సమయాలు మాత్రం మారవు.
ఎస్బీఐ కార్డులపై ఉచిత బీమా ఎత్తివేత :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ రకాల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై ఉచిత విమాన ప్రమాద బీమా కవర్‌ను నిలిపివేయనుంది. ఈ కార్డులలో యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరూర్ వైశ్యా బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ ఇతరుల పార్టన్లరతో జారీ అయ్యాయి. పైన పేర్కొన్న క్రెడిట్ కార్డులపై రూ. 50 లక్షలు నుంచి రూ. 1 కోటి వరకు బీమా కవరేజ్ ఇకపై వర్తించదు.
UPI క్రెడిట్ లైన్లు ప్రారంభం :
ఆగస్టు 31 నుంచి యూపీఐ వినియోగదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్లు లేదా ఆస్తికి సంబంధించి రుణాలు వంటి ముందస్తు ఆమోదం పొందిన క్రెడిట్ లైన్‌లను లింక్ చేసేందుకు అనుమతి ఉంటుంది. NPCI నిర్దేశించిన రోజువారీ పరిమితులలోపు యూపీఐ ద్వారా పేమెంట్లు, మర్చంట్ లావాదేవీలు, క్యాష్ విత్‌డ్రా వంటివి కూడా చేయగలరు.
ఆర్‌బీఐ పాలసీ మీటింగ్ :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు సమావేశమవుతుంది. ఈ కమిటీ ప్రస్తుత రెపో రేటును సమీక్షిస్తుంది. ఆర్థిక వ్యవస్థ అంతటా రుణ రేట్లు, వడ్డీ ఆదాయాలను ప్రభావితం చేస్తుంది.
ఇంధన ధరలపై రివ్యూ గడువు ముగింపు :
ప్రతి నెల మాదిరిగానే LPG, CNG, PNG, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలను ఆగస్టులో సమీక్షించే అవకాశం ఉంది. ధరలలో ఏదైనా మార్పు, హోం బడ్జెట్‌లు, ప్రయాణ ఖర్చులను నేరుగా ప్రభావితమవుతాయి.
పార్లమెంటులో చర్చలో ఆర్థిక బిల్లులు :
ఆగస్టు 21 వరకు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనేక ఆర్థిక, పన్ను సంబంధిత సంస్కరణలు చర్చకు వస్తున్నాయి. ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలతో భవిష్యత్తులో వ్యాపార సౌలభ్యంతో పాటు పన్ను సమ్మతిని ప్రభావితం చేయవచ్చు.