ఓలా,ఊబర్లే ఆటో సంక్షోభానికి కారణం..నిర్మలాకు మారుతి కౌంటర్

ఆటోమొబైల్ రంగం సంక్షోభానికి కారణం యువత ోలా,ఊబర్ వంటీ  ట్యాక్సీ సేవలను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతుండడమే అంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. నిర్మలా వ్యాఖ్యాలను దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ అంగీకరించలేదు.

వాహన విక్రయాల ప్రస్తుత మందగమనానికి ఇది బలమైన అంశం కానేకాదని, ఓ అభిప్రాయానికి రావడానికి ముందుగా పూర్తిస్థాయి అధ్యయనం అవసరమని,ప్రజలు ఇప్పటికీ కార్లను తమ ఆంకాక్ష మేరకు కొనుగోలు చేస్తున్నారని మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్(మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.  ఓలా, ఉబెర్‌ అంశం ప్రస్తుత మందగమనానికి  కారకం కాదన్నారు. ఆటో మార్కెట్‌ మందగమనానికి ఎన్నో కారణాలున్నాయని శ్రీవాస్తవ అన్నారు. మార్కెట్లో లిక్విడిటీ (నిధులు/రుణాలు) కొరత, నియంత్రణపరమైన అంశాల వల్ల (భద్రతా ఫీచర్ల అమలు వంటి) ఉత్పత్తుల ధరలు పెరగడం, అధిక పన్నులు, బీమా ప్రీమియం రేట్లు పెరగడం వంటి చాలా కారణాలున్నాయన్నారు. 

ఓలా, ఉబెర్‌ గత ఆరు, ఏడేళ్లుగా మార్కెట్లో ఉన్నాయని, ఈ సమయంలో ఆటో పరిశ్రమ అత్యుత్తమ ప్రదర్శన చవిచూసింది. గత కొన్ని నెలల్లోనే ఏమైంది? ఇది ఓలా, ఉబెర్‌ వల్లేనని ఆలోచించకండి అని శ్రీవాస్తవ అన్నారు. అమెరికాలో ఉబెర్‌ బలమైన ప్లేయర్‌గా ఉన్నప్పటికీ, అక్కడ కార్ల విక్రయాలు గత కొన్ని సంవత్సరాల్లో బలంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో 46 శాతం మంది కార్లు కొనే వారు, మొదటి సారి కొనుగోలుదారులే. ఇది కారు కొనాలన్న వారి ఆకాంక్షల వల్లే అని ఆయన అన్నారు. గత నెల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలు దీర్ఘకాలానికి పరిశ్రమకు మేలు చేసేవని, ప్రస్తుత మందగమనానికి బ్రేక్‌ వేసేందుకు చాలవనే అభిప్రాయాన్ని శ్రీవాత్సవ  వ్యక్తం చేశారు