ప్రపంచ నగరాలతో పోటీపడేలా హైదరాబాద్‌ అభివృద్ధి ‌: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Minister Uttam Kumar Reddy: హైదరాబాద్‌ను ప్రపంచంలోని అత్యుత్తమ ప్రపంచ నగరాలతో పోటీపడేలా పెట్టుబడిదారులకు ఉత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా మారుస్తామని తెలంగాణ నీటిపారుదల, ఆహారం – పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని తెలిపారు. హైదరాబాద్‌-మియాపూర్ నరేన్ గార్డెన్స్‌ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన ‘టైమ్స్ వెస్ట్ హైదరాబాద్ ఎక్స్‌పో’ను టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంధ్ర- తెలంగాణ రెస్పాన్స్ హెడ్ కమల్ కృష్ణన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణ రంగానికి అన్నివిధాలుగా ప్రభుత్వం తరపున సహయ సహకారాలు అందిస్తామన్నారు.

”ప్రపంచ నగరాల్లోని అధునాతన వాటర్‌ఫ్రంట్‌ల తరహాలో హైదరాబాద్లోని మూసీ నదికి మైలురాయిగా నిలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం 22,000 కోట్ల ప్రాంతీయ రింగ్ రోడ్‌ను కూడా ప్రకటించింది. నగరాన్ని మేటిగా నిలపడంలో భాగంగా గ్రీన్ హైదరాబాద్, కాలుష్య రహిత హైదరాబాద్, గ్రీన్ బిల్డింగ్‌లను ప్రోత్సహించడానికి, స్థిరమైన జీవనం కోసం అవసరమైన ప్రతి అంశానికి మద్దతు ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను నిరంతరం ఆకర్షిస్తున్నాం.. ఇందులో భాగంగానే కొన్ని సంవత్సరాలలో హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలోని అత్యుత్తమ ప్రపంచ నగరాలతో పోటీపడేలా పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానంగా మారుస్తామని ఆశిస్తున్నాం. ఈ ప్రాపర్టీ షో నిర్దిష్ట లక్ష్యాలను సాధిస్తుందని మరియు బిల్డర్లు, కస్టమర్‌లు ఇద్దరూ సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Also Read: వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఆధారిత ప్రొఫైల్ ఫొటోలను క్రియేట్ చేయొచ్చు!

టైమ్స్ వెస్ట్ హైదరాబాద్ ఎక్స్‌పో 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనుంది. ఇందులో 20కు పైగా డెవలపర్‌ల నుంచి 50 పైగా ప్రాజెక్ట్‌లతో పాటు వెస్ట్ హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న విభిన్న రకాల ప్రాపర్టీల వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి అవకాశాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఈ ఎక్స్‌పో తోడ్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు timesrealestateexpo వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ట్రెండింగ్ వార్తలు