ఇండియన్ మార్కెట్‌లో చైనీస్ ఫోన్ హవా.. ఐఫోన్, సాంసంగ్‌ని తొక్కుకుంటూ పోతుంది..

చైనా బ్రాండ్లు ఇండియన్‌ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తుండానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి.

smart phones

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్. 142 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లను మారుమూల గ్రామాల్లోనూ వినియోగిస్తున్నారు. దేశంలో ప్రతి ఏడాది స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఒక శాతం వృద్ధిని సాధిస్తోంది.

అందుకు తగ్గట్టుగానే ప్రపంచ ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు భారత్‌లో తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు దేశంలో నోకియా మొబైళ్లను అధికంగా వాడేవారు. ఆ తర్వాత ఐఫోన్లు, సాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌లను భారతీయులు అధికంగా వాడుతున్నారు.

ప్రస్తుతం 5జీ, ఏఐ ఫీచర్లతో పనిచేసే స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే యూజర్లు స్మార్ట్‌ఫోన్లను కొంటున్నారు. ఇప్పుడు భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్‌ఫోన్లు ఏవో తెలుసా? ఐఫోన్, సాంసంగ్‌ ఫోన్లు కాదు. వాటిని అధిగమిస్తూ చైనీస్‌ ఫోన్ వివో దూసుకు వెళుతోంది.

kisan credit card: రైతులకు రూ.5లక్షలు ఇచ్చే స్కీమ్.. ఎలా అప్లయ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

రాకెట్‌లా దూసుకుపోతున్న వివో
గత ఏడాది వివో 19 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. 2023లో దాని మార్కెట్‌ షేర్‌ 17 శాతంగా ఉండేది. గత ఏడాది షియోమి 17 శాతం వాటాతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక సాంసంగ్‌ మూడో స్థానానికి పడిపోయింది. 2023లో సాంసంగ్‌ వాటా 18 శాతంగా ఉండేది. 2024లో అది 16 శాతానికి పడిపోయింది. ఒప్పో 15 శాతం వాటాతో నాలుగో స్థానంలో నిలిచింది. రియల్మీ 11 శాతం మార్కెట్ వాటాతో ఐదో స్థానంలో ఉంది.

ప్రతి సెగ్మెట్‌లోనూ వివో ఆధిపత్యం కనబర్చుతోంది. గత ఏడాది నాలుగో త్రైమాసికంలో వివో 20 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక షియోమి 16 శాతం, సాంసంగ్ 15 శాతం, ఒప్పో 14 శాతం, ఆపిల్ 11 శాతంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. మన దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం వహిస్తున్న తొలి ఐదు బ్రాండ్లలో చైనీస్‌వే అధికం. దక్షిణ కొరియా బ్రాండ్లలో కేవలం సాంసంగ్‌ మాత్రమే టాప్‌-5లో ఉంది. భారత యూజర్లు అధికంగా చైనా బ్రాండ్లవైపే మొగ్గు చూపుతున్నారు.

చైనా బ్రాండ్లదే ఎందుకు ఆధిపత్యం?
చైనా బ్రాండ్లు ఇండియన్‌ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తుండానికి ప్రధాన కారణాలు వాటి ధర, నాణ్యత. ఈ కారణం వల్ల చైనా బ్రాండ్లు వివో, రియల్మీ, ఇతర బ్రాండ్లు అధికంగా అమ్ముడుపోతున్నాయి. ఈ చైనీస్‌ బ్రాండ్లు సాంసంగ్‌, ఆపిల్‌తో పోలిస్తే తక్కువ ధరలకు లభిస్తూ, అధిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. దీంతో యూజర్ల దృష్టి వీటిపై మళ్లింది.