kisan credit card: రైతులకు రూ.5లక్షలు ఇచ్చే స్కీమ్.. ఎలా అప్లయ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

రైతులు వ్యవసాయ ప్రయోజనాలకోసం కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాన్ని సులభంగా పొందవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం..

kisan credit card: రైతులకు రూ.5లక్షలు ఇచ్చే స్కీమ్.. ఎలా అప్లయ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

kisan credit card

Updated On : February 2, 2025 / 2:51 PM IST

KCC Scheme: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు రుణ సదుపాయాన్ని వ్యవసాయ అవసరాలకు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించేందుకు, గ్రామీణాభివృద్ధికి కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని ప్రస్తుత రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. రైతులకు ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించారు. తద్వారా రైతులు తమ వ్యవసాయ అవసరాలను తీర్చుకోవడానికి మరిన్ని నిధులను పొందవచ్చు.

Also Read: Budget 2025 : బడ్జెట్ బిగ్ ఎఫెక్ట్.. ఏం పెరుగుతాయి? ఏం తగ్గుతాయి? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..

రైతులు వ్యవసాయ ప్రయోజనాలకోసం కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాన్ని సులభంగా పొందవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం.. మూడు లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, ఇతర సేవా ఛార్జీలను వసూళ్లు చేయొద్దని బ్యాంకులను ఆదేశించింది. తద్వారా సన్నకారు రైతులకు ఆర్థికభారం తగ్గనుంది. రూ.3లక్షల కంటే మించి రుణాలు తీసుకుంటే.. ప్రాసెసింగ్ ఫీజులు, తనిఖీ ఖర్చులు వంటి ఛార్జీలను ఒక్కొక్క బ్యాంకులు తమ బోర్డు ఆమోదించిన పాలసీల ఆధారంగా నిర్ణయిస్తాయి. కేసీసీ పథకం కింద రుణాలు తీసుకుంటే మొదటి దఫా 7శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఆ తరువాత దానికి 4శాతం (పావలా వడ్డీ) వర్తిస్తుంది. ఈ రాయితీని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది. బ్యాంకు ఇచ్చిన రుణం మొత్తాన్ని కేసీసీ కార్డుతో ఏటీఎం కార్డు మాదిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. బడ్జెట్ లో పరిమితి పెంచడంతో మరింత ఎక్కువ మంది రైతులు ఈ కార్డులు పొందే అవకాశం ఉంది.

Also Read: Budget 2025 : కేంద్రం గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతులకు రూ.5 లక్షలు..

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు పొందాలంటే డిజిటల్ భూ రికార్డులు సరిపోతాయి. కేసీసీ దరఖాస్తులకు డిజిటల్ సంతకం చేసిన ఆన్ లైన్ భూ రికార్డులు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే, అనేక రాష్ట్రాల్లో భూమి రికార్డుల అసంపూర్ణ డిజిటలైజేషన్ కారణంగా ఈ పత్రాల ప్రామాణికతను నిర్ధారించడానికి బ్యాంకులకు తరుచుగా చట్టపరమైన అభిప్రాయాలు కోరుతాయి. కొన్ని బ్యాంకులు భూమి యజమాని, అతని పేరుపై ఉన్న బకాయిలను ధృవీకరిస్తూ తహసీల్దార్ నుంచి దృవపత్రాలను తీసుకొని రుణాలు అందిస్తున్నాయి.

 

కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలంటే..
♦  కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకం కోసం మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంక్ వెబ్ సైట్ ను సందర్శించాలి.
♦  బ్యాంక్ వెబ్ సైట్ లోని ఎంపికల జాబితా నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు ఎంపికను ఎంచుకోవాలి.
♦  ‘అప్లయ్’ ఎంపికపై క్లిక్ చేయాలి. మీకు కావాల్సిన అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
♦  దానిలో అవసరమైన వివరాలతో ఫారమ్ ను పూరించాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్ పై నొక్కాలి.
♦  సబ్మిట్ చేసిన తరువాత మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది.
♦  మీకు అర్హత కలిగి ఉంటే తదుపరి ప్రక్రియ కోసం 3 నుంచి 4 రోజుల్లో బ్యాంక్ సిబ్బంది మిమ్మల్ని సంప్రదిస్తారు.