Budget 2025 : కేంద్రం గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతులకు రూ.5 లక్షలు..
Budget 2025 : పేదలు, యువత, అన్నదాత రైతులు, మహిళలపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. బడ్జెట్ ప్రారంభం కాగానే కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ పెద్ద ప్రకటన చేశారు.

Kisan credit card limit
Budget 2025 : రైతన్నలకు గుడ్ న్యూస్.. కేంద్ర బడ్జెట్ 2025లో కిసాన్ క్రెడిట్ లిమిట్ పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతులకు రుణ సదుపాయాన్ని వ్యవసాయ అవసరాలకు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించేందుకు, గ్రామీణాభివృద్ధికి కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని ప్రస్తుత రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. రైతులకు ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించారు. తద్వారా రైతులు తమ వ్యవసాయ అవసరాలను తీర్చుకోవడానికి మరిన్ని నిధులను పొందవచ్చు.
1998లో ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం, రైతులకు రుణ భద్రతకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. రైతుల భూములపైఆధారపడిన ఈ పథకం.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వ్యవసాయ ఇన్‌పుట్‌లను కొనుగోలుకు, ఇతర ఉత్పత్తి సంబంధిత ఖర్చుల కోసం సులభంగా, సరసమైన నిధులను పొందేందుకు రూపొందించారు. కేసీసీ పరిమితిని విస్తరించడం వల్ల రైతులు వారి పంట ఉత్పత్తి, అనుబంధ కార్యకలాపాల కోసం వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి వీలు కల్పించాలని భావిస్తున్నారు.
ఈ కేసీసీ పెంపుతో, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, రైతులు తమ ఆర్థిక నిర్వహణ, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పెట్టుబడులు పెట్టడం, ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో గ్రామీణాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలకు మద్దతునిస్తూ వ్యవసాయ రుణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురానుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? :
రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం 1988లో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC)ని ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా రైతులకు చౌక వడ్డీ రేట్లకు రుణాలు అందుబాటులోకి వస్తాయి. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ కలిసి ప్రారంభించాయి. దీనికి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని పేరు పెట్టారు. వ్యవసాయంతో పాటు, చేపల పెంపకం లేదా పశుపోషణ చేసే వినియోగదారులు కూడా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
త్వరలో కొత్త కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డుల జారీ :
ఇప్పటివరకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రూ. 3 లక్షలుగా ఉండేది. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా రూ. 5 లక్షల పరిమితితో కొత్త కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ధన ధాన్య యోజన ద్వారా కోట్లాది మంది రైతులు లబ్ది పొందనున్నారు.
ఈ పథకం కింద తక్కువ ఉత్పత్తి, ఆధునిక పంటల తీవ్రత, సగటు కంటే తక్కువ క్రెడిట్ పరామితులు కలిగిన 100 జిల్లాలు ఇందులోకి చేరుతాయి. దీనివల్ల 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అంతేకాదు.. ఎడిబుల్ ఆయిల్‌లో స్వావలంబనను పెంచడానికి ఆరేళ్ల మిషన్‌ను ప్రకటించారు. అలాగే పండ్లు, కూరగాయలకు సంబంధించిన సమగ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు.