రైళ్లలో పాములు.. భారత్ వ్యాప్తంగా కింగ్ కోబ్రాలు ఎలా వ్యాప్తి చెందుతున్నాయంటే?
ఈ కోబ్రాలు కనిపించే అత్యంత అసాధారణ ప్రాంతాల్లో రైల్వే ప్రదేశాలు కూడా ఉన్నాయని తేల్చారు.
Snakes on a train: మన దేశంలో రైల్వే నెట్వర్క్లు ఎంత రద్దీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వాటిలో మనుషులు మాత్రమే ప్రయాణిస్తారనుకుంటే పొరపాటే. కింగ్ కోబ్రాలు కూడా రైళ్లను బాగా వాడేస్తున్నాయి. వాటి సాయంతోనే కింగ్ కోబ్రాలు భారతదేశం అంతటా విస్తరిస్తున్నాయని ఓ అధ్యయనంలో తేలింది.
పశ్చిమ కనుమల కింగ్ కోబ్రా (ఓఫియోఫాగస్ కాళింగా- ఒక కింగ్ కోబ్రా జాతి శాస్త్రీయ నామం)లు భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్న జాతికి చెందినవి. ఈ జాతి పాములు రైళ్ల ద్వారా భారతదేశ పశ్చిమ పర్యాటక రాష్ట్రం గోవాలోని అనేక భాగాలకు విస్తరిస్తున్నట్టు రికార్డుల్లో నమోదు అయ్యింది.
సాధారణంగా ఈ జాతి పాములు గోవా అడవుల్లో, నదులు, వాగులు సమీపంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఆ రాష్ట్రంలోని ప్రసిద్ధ తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉంటాయి.
కానీ, దశాబ్దాల రికార్డులను పరిశీలించి చూసిన పరిశోధకులు ఈ కోబ్రాలు కనిపించే అత్యంత అసాధారణ ప్రాంతాల్లో రైల్వే ప్రదేశాలు కూడా ఉన్నాయని తేల్చారు.
రైళ్లలో ఉన్న సరుకు బోగీల్లో, దాచుకునేందుకు వీలున్న చోట్లలో, ఎలుకల కోసం వెంబడిస్తూ అనుకోకుండా ఎక్కి, తర్వాత మరో ప్రాంతంలో దిగిపోతున్నాయి.
Also Read: అడ్డదిడ్డంగా కారు నడిపిన 12వ తరగతి విద్యార్థి.. రోడ్డుపై ఆరేళ్ల బాలుడి మృతి, పలువురికి గాయాలు
అత్యంత రద్దీగా ఉండే భారతదేశ రైల్వే నెట్వర్క్లు కింగ్ కోబ్రాల వలసలను ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకులు చెప్పారు. 2002 నుంచి 2024 వరకు నమోదైన సమాచారాన్ని తీసుకుని పరిశోధకులు ఈ వివరాలు గుర్తించారు.
గోవా రాష్ట్రంలో మొత్తం 47 వేర్వేరు ప్రదేశాల్లో ఆ జాతి పాములు కనిపించినట్టు గుర్తించారు. వాటిలో 18 ప్రదేశాలు ఉత్తర గోవాలో, 29 ప్రదేశాలు దక్షిణ గోవాలో ఉన్నాయి. గోవాలో ఉత్తర భాగం కంటే దక్షిణ భాగంలో ఈ పాములు ఎక్కువగా ఉన్నాయి.
వీటిలో 5 సార్లు కింగ్ కోబ్రాలు రద్దీ రైల్వే మార్గాల సమీపంలోనే కనపడ్డాయని పరిశోధకులు బయోట్రోపికా జర్నల్లో పేర్కొన్నారు.
రైళ్లలో పాములు కనిపించిన తాజా సంఘటనలు ఉన్నాయి. సహజంగా పాములు ఉండలేని రైలు యార్డ్లాంటి అననుకూల ప్రదేశాల్లో కూడా కింగ్ కోబ్రా జాతి పాము కనిపించింది.
పాములు, ముఖ్యంగా కింగ్ కోబ్రాలు, అనుకోకుండా రైళ్లలో ఎక్కి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి తమ పరిధిని పెంచుకుంటున్నాయేమో అని పరిశోధకులు భావిస్తున్నారు. రైళ్లలో పాములు వాటికి తెలియకుండానే కొత్త ప్రాంతాలకు వెళ్తున్నాయి. అందువల్ల అవి ఇంతకు ముందు కనపడని కొత్త ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నాయి.
