Post Office Scheme
Post Office Scheme : మీ డబ్బును ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియడం లేదా? చాలామంది తమ సంపాదనలో కొద్ది మొత్తమైనా ఆదా చేయాలని భావిస్తుంటారు. అందుకు సరైన పెట్టుబడి పథకాల కోసం చూస్తుంటారు. మీరు కూడా మీ డబ్బును పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే.. మీకోసం పోస్టాఫీసు అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది.
సురక్షితమైన పెట్టుబడితో పాటు మంచి రాబడిని కూడా పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల్లో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) ఒకటి.. ఈ పోస్టాఫీస్ పథకంలో మీరు ప్రతి నెలా కేవలం రూ. 5వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 8 లక్షల భారీ మొత్తాన్ని సేకరించవచ్చు. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. పెట్టుబడిపై లోన్ కూడా తీసుకోవచ్చు.
ఎంత వడ్డీ పొందొచ్చంటే? :
గత ఏడాది 2023లోనే కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేట్లను పెంచింది. ఈ కొత్త రేట్లు అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో వర్తిస్తాయి. ఈ పథకంలో పెట్టుబడిపై వడ్డీ రేటు విషయానికి వస్తే.. 6.7 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తుంది. ఈ పథకంలో 29 సెప్టెంబర్ 2023న చివరి సవరణ జరిగింది.
రూ. 8 లక్షలకు పైగా ఎలా సంపాదిస్తారంటే? :
పోస్ట్ ఆఫీస్ (RD)లో పెట్టుబడి, వడ్డీని లెక్కించడం చాలా సులభం. ఈ పథకం కింద నెలకు కేవలం రూ. 5వేలు ఆదా చేయడం ద్వారా మీరు రూ. 8 లక్షల డబ్బులను ఈజీగా కూడబెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతి నెలా రూ. 5వేలు పెట్టుబడి పెట్టాలి. మెచ్యూరిటీ కాలంలో 5 ఏళ్లలో మొత్తం రూ. 3 లక్షలు క్రెడిట్ అవుతుంది. దానిపై 6.7 శాతం రేటుతో వడ్డీకి రూ. 56,830 అవుతుంది.
మొత్తంగా, మీ ఫండ్ 5 ఏళ్లలో రూ. 3,56,830 అవుతుంది. అయితే, మీరు ఈ RD అకౌంట్ మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు. తద్వారా మీరు 10 ఏళ్లలో డిపాజిట్ చేసిన మొత్తం రూ. 6లక్షలు అవుతుంది. దాంతో పాటు, ఈ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ మొత్తం రూ. 2,54,272 అవుతుంది. దీని ప్రకారం.. 10 ఏళ్ల కాలంలో డిపాజిట్ చేసిన ఫండ్ మొత్తం రూ. 8,54,272 అవుతుంది.
50 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు :
మీకు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇందులో పెట్టుబడిని రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. పోస్ట్ ఆఫీస్ RD మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది. కానీ, మీరు ఈ వ్యవధి పూర్తయ్యేలోపు అకౌంట్ క్లోజ్ చేయాలంటే ఈ సేవింగ్స్ స్కీమ్‌లో కూడా సౌకర్యం అందుబాటులో ఉంది.
పెట్టుబడిదారుడు 3 ఏళ్ల తర్వాత ముందస్తుగా క్లోజ్ చేయొచ్చు. ఇందులో రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మీ అకౌంట్ ఒక ఏడాది పాటు యాక్టివ్‌గా ఉన్న తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. అయితే, రుణంపై వడ్డీ రేటు వడ్డీ రేటు కన్నా 2 శాతం ఎక్కువగా ఉంటుంది.