Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులతో సేవింగ్స్ (Post Office Scheme) చేయడం చాలా కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు సురక్షితమైన పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి రెట్టింపు చేసే పథకాలనే ఎంచుకుంటున్నారు.
మీరు కూడా ఏదైనా సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. పోస్టాఫీస్ అందించే కిసాన్ వికాస్ పత్రను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ డబ్బు కొద్ది రోజుల్లోనే రెట్టింపు అవుతుంది. ప్రభుత్వ పథకం కావడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని దాదాపు 9 ఏళ్లు 7 నెలలు కొనసాగిస్తే అధిక మొత్తంలో రెట్టింపు రాబడిని పొందవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర ఏంటి? :
కిసాన్ వికాస్ పత్ర 1988 సంవత్సరంలో ప్రారంభమైంది. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ హామీ కారణంగా ఈ పథకం చాలా సురక్షితమైనదిగా చెప్పవచ్చు.
పెట్టుబడి మొత్తం ఎంతంటే? :
ఈ పథకంలో కనీసం రూ. వెయ్యితో ప్రారంభించవచ్చు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. చిన్న పెట్టుబడిదారుడు రూ. వెయ్యి పెట్టుబడి పెట్టినా లేదా పెద్ద పెట్టుబడిదారుడు రూ. లక్ష పెట్టుబడి పెట్టినా, రెండింటిలోనూ ప్రయోజనం పొందవచ్చు.
వడ్డీ, రాబడి :
ప్రస్తుతం, కేవీపీ పథకం కింద ఏడాదికి 7.5శాతం వడ్డీని అందిస్తుంది. ప్రతి ఏటా చక్రవడ్డీగా పొందవచ్చు. మీ వడ్డీ అసలుకు యాడ్ అవుతుంది. దానిపై వడ్డీ కూడా సంపాదించుకోవచ్చు. మీ డబ్బు 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు.. మీరు రూ. 8వేలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ. 16వేలు పొందవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు :
ఐడెంటిటీ ప్రూఫ్ : ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటరు ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్
అడ్రస్ ప్రూఫ్ : ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్ లేదా పవర్ బిల్లు
రూ. 50వేల కన్నా ఎక్కువ పెట్టుబడులకు పాన్ కార్డ్ తప్పనిసరి. రూ. 10 లక్షలకు పైగా పెట్టుబడులకు ఆదాయ రుజువు (శాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా ఐటీఆర్) ఉండాలి.
ఎలా అప్లయ్ చేయాలి? :
పెట్టుబడి పెట్టేందుకు సమీపంలోని పోస్టాఫీసు లేదా రిజిస్టర్డ్ బ్యాంక్ బ్రాంచ్‌లో అప్లయ్ ఫారమ్ (ఫారం A) నింపాలి. పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, పెట్టుబడి మొత్తం, పేమెంట్ విధానం, నామినీ వివరాలను పూరించాలి. అలాగే, కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాలి.
రూ. 50వేల వరకు క్యాష్ డిపాజిట్ :
రూ. 50వేల కన్నా ఎక్కువ మొత్తాన్ని చెక్కు, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా ఆన్‌లైన్ మోడ్ (RTGS/NEFT) ద్వారా డిపాజిట్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీరు కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ పథకం చాలా సురక్షితం కూడా.
ఈ పథకం ఎలా పనిచేస్తుంది? :
మీరు రూ. 5వేలు పెట్టుబడి పెట్టారని అనుకుంటే.. ఈ మొత్తం ప్రతి ఏడాదిలో వడ్డీతో పాటు పెరుగుతుంది. 115 నెలల తర్వాత ఈ మొత్తం రూ. 10వేలకు చేరుతుంది.
Disclaimer : ఈ పెట్టుబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. మీరు పోస్టాఫీసులో ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు ఓసారి మీ ఆర్థిక నిపుణులను సంప్రదించండి.