Gold loan: బంగారం తాకట్టు పెడుతున్నారా? మీలాంటివారి కోసమే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు!

రుణాలు ఇచ్చే అన్ని సంస్థలకూ ఒకే విధమైన నియంత్రణ విధించాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

Gold loan: బంగారం తాకట్టు పెడుతున్నారా? మీలాంటివారి కోసమే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు!

Updated On : March 7, 2025 / 4:18 PM IST

బంగారాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా? బంగారాన్ని తనఖా పెట్టగా వచ్చిన డబ్బును ఎడాపెడా వాడేస్తున్నారా? అయితే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకురానున్న కొత్త నిబంధనల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. బంగారంపై రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆర్‌బీఐ ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు గోల్డ్ లోన్లకు సంబంధించి మరింత కఠిన విధానాలను పాటించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. పూచీకత్తు ప్రక్రియలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు.

దీని ప్రకారం.. ఎవరైనా రుణాలను తీసుకుంటే ఆ నిధులను దేనికోసం ఖర్చు పెడుతున్నారో కూడా బ్యాంకులు తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో మీరు బంగారాన్ని పెట్టి డబ్బు తీసుకునేటప్పుడు మీరు ఈ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. తక్కువ సమయంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న గోల్డ్ లోన్‌ రంగాన్ని నియంత్రించేందుకు RBI ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

RBI “కఠిన నియంత్రణల” ముఖ్య ఉద్దేశం ఏంటంటే? 

  • గోల్డ్ లోన్ రంగం అనుకున్న దాని కన్నా ఎక్కువగా వృద్ధి చెందుతున్న సమయంలో దాన్ని నియంత్రణలో ఉంచడం
  • అనైతిక వ్యాపార పద్ధతులను అరికట్టడం
  • ఆర్థిక సుస్థిరతను కాపాడటం

గోల్డ్ లోన్ రంగంపై నియంత్రణ తప్పకుండా ఉండాలని, స్థిరమైన వృద్ధి కోసం వ్యాపార సంస్థలు అనుసరించాల్సిన నియమాలను తప్పకుండా పాటించాలని RBI కోరుకుంటుందని నిపుణులు అంటున్నారు.

మీరు బంగారంపై రుణం తీసుకునేటప్పుడు ఇక మీ బ్యాగ్రౌండ్ చెక్‌ను కూడా కఠినంగా అమలు చేయనున్నారు. గోల్డ్ రుణగ్రహీతల బ్యాగ్రౌండ్ చెక్‌ను మరింత కఠినతరం చేయాలని, తప్పనిసరిగా తాకట్టు పెట్టిన బంగారం ఎవరికి చెందిందో నిర్ధారించాలని, రుణం ద్వారా తీసుకున్న డబ్బును చెప్పిన విధంగా వాడుతున్నారా? లేదా? అనే విషయాన్ని పర్యవేక్షించాలని RBI బ్యాంకింగ్ సంస్థలను కోరనుంది. గోల్డ్ లోన్ విషయంలో మోసాలు జరుగుతున్నట్లు గుర్తించిన RBI, ఈ రుణాలపై నిఘా పెంచాలని నిర్ణయించింది.

Gold Forecast: ట్రేడ్‌ టారిఫ్‌ల వల్ల బంగారంలో వరదలా పెట్టుబడులు.. మీరు పసిడి కొంటున్నారా?

RBI ఆడిట్లో గుర్తించిన సమస్యలు

  • సెప్టెంబర్ 2024 నుంచి బ్యాంకుల గోల్డ్ లోన్లు 50% పెరిగాయి, ఇది మొత్తం రుణాల వృద్ధికి కంటే అధికంగా ఉంది.
  • RBI గతంలో గోల్డ్ లోన్ రంగంలో అనేక అక్రమ వ్యవహారాలను గుర్తించింది.
  • బ్యాంకులు, NBFCలు లోన్ ప్రక్రియను పునఃసమీక్షించాలని RBI ఆదేశించింది.
  • కొంతమంది NBFCలు ప్రామాణిక నియమాలను పాటించకుండా బంగారం తాకట్టు పెట్టి లోన్లు ఇస్తున్నాయి.
  • బంగారం సేకరించడం, నిల్వ చేయడం, బరువు కొలవడం లాంటి పనులను బ్యాంకులు చేయకుండా ఏజెంట్లు ద్వారా చేయిస్తున్నాయి.
  • లోన్ తీసుకున్నవారు తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు, కొన్ని సంస్థలు వారికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వారి బంగారాన్ని వేలం వేయడం.

గోల్డ్ లోన్ రంగంపై RBI లక్ష్యం ఏంటంటే?
రుణాలు ఇచ్చే అన్ని సంస్థలకూ ఒకే విధమైన నియంత్రణ విధించాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. బంగారం వేలం వేయడం, లోన్ డబ్బును ఎక్కడ వినియోగిస్తున్నారో పర్యవేక్షించడం లాంటి నియంత్రణలను కఠినతరం చేయాలని యోచిస్తోంది.

ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం కోసం, ఆర్థిక నేరాలను నివారించడానికి, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై పర్యవేక్షణను పెంచడం వంటి చర్యల ద్వారా గోల్డ్ లోన్ రంగాన్ని RBI మరింత నియంత్రణలోకి తీసుకురావాలని చూస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.