RBI No OTP New Guidelines : రూ.15 వేల లోపు చెల్లింపులకై RBI కొత్త రూల్స్.. OTPపై కీలక అప్డేట్
RBI No OTP New Guidelines : ఆటో పేమెంట్స్, ఈమాండెట్, ఓటీపై వంటి వాటికి సంబంధించి ఆర్బీఐ కొత్త నియమాలు చేసింది. ఆ వివరాలు..
RBI Updated E Mandate Rules And No OTP For Payments Up To Rs 15000
RBI No OTP New Guidelines : డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నియమాలను తీసుకువచ్చింది. ఆటో డెబిట్ పరిమితిని పెంచింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, రూ.15,000 లోపు జరిగే రికరింగ్ (పునరావృత) లావాదేవీలకు ఇకపై ప్రతిసారీ ఓటీపీ (OTP) వంటి అదనపు ధృవీకరణ అవసరం లేదు. అలానే వినియోగదారులు అదనపు ధృవీకరణ పద్ధతి ద్వారా ఒకసారి ఈ-మాండేట్ నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రూ.15 వేల లోపు ఉండే సబ్స్క్రిప్షన్లు, కరెంట్ బిల్లులు, ఈఎంఐలు ఆటోమేటిక్‌గా చెల్లించేందుకు అవకాశం లభించనుంది.
రూ.15 వేల కన్నా ఎక్కువ మొత్తంలో జరిగే చెల్లింపులకు మాత్రం అదనపు ధృవీకరణ అవసరం. అయితే ఓటీపీ పరిమితి కేవలం రూ.15 వేల వరకే అని ప్రకటించినప్పటికీ.. కొన్ని ముఖ్యమైన విభాగాలకు ఆర్బీఐ మినహాయింపునిచ్చింది. కింద పేర్కొన్న వాటికి రూ.1 లక్ష వరకు ఓటీపీ లేకుండా ఆటో-డెబిట్ అనుమతించబడుతుంది:
- ఇన్సూరెన్స్ ప్రీమియంలు (Insurance Premiums)
- మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు (Mutual Fund Investments)
- క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు
ఈ నిబంధనలు యూపీఐ (UPI) ఆటో-పే, డెబిట్/క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి. అలానే ఈ-మాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు. అనధికారిక లావాదేవీలు జరిగితే, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది.
వినియోగదారులకు తెలియకుండా.. ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా చూసేందుకు గాను ఆర్బీఐ ‘అలర్ట్ సిస్టమ్’ను తప్పనిసరి చేసింది. వినియోగదారుడి ఖాతా నుంచి నగదు కట్ అవ్వడానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్‌కి మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. దీనిలో ఎవరి పేరు మీద డబ్బు కట్ అవుతుంది.. ఎంత కట్ అవుతుంది.. డెబిట్ తేదీ వంటి వివరాలు స్పష్టంగా ఉండాలి. ఈ సమాచారం వినియోగదారుడికి తెలిసిన తర్వాత.. వారు ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేయడం లేదా నిలిపివేయడానికి అవకాశం ఇవ్వాలి. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది.
