యస్ బ్యాంక్ ఫెయిల్ కానివ్వం…SBI చైర్మన్

సమస్యలు,వివాదాల నుంచి యస్ బ్యాంక్ బయటపడుతుందని ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదన్నారు. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని సానుకూల సంకేతాలిచ్చారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ …యస్‌ బ్యాంకును కుప్పకూలనివ్వమని, ఏదో ఒక పరిష్కారం తప్పక లభిస్తుందన్నారు. కొత్త మూలధన సమీకరణ కోసం యస్‌ బ్యాంక్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్‌బీఐ ఛీఫ్‌ వ్యాఖ్యలు  ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

యస్‌ బ్యాంకును సంక్షోభం నుంచి బయటపడేసేందుకు యత్నించాలని ప్రభుత్వం ఎస్‌బీఐని కోరవచ్చన్న అంచనాలకు రజనీశ్‌ వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల బ్యాలెన్స్ షీట్‌తో మార్కెట్లో కీలకమైన బ్యాంకుగా ఉన్న యస్‌ బ్యాంకు కుప్పకూలే పరిస్థితి రాదన్నది తన అభిప్రాయమన్నారు.. రజనీశ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో యస్‌ బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం లాభపడింది.  కాగా గత నెలలో య స్‌బ్యాంకును బయటపడేసేందుకు ఎస్‌బీఐ ఎలాంటి ప్రయత్నం చేయదని రజనీశ్‌ వెల్లడించడం గమనార్హం. కేవలం నెలరోజుల్లోనే ఆయన అభిప్రాయాల్లో మార్పు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. 

ప్రధానంగా ప్రమోటర్ రానా కపూర్ ఆకస్మికంగా నిష్క్రమించిన తరువాత బ్యాంకు తీవ్ర సంక్షోభంలోకి పడిపోయింది.  జనవరి 10 న జరిగిన బోర్డు సమావేశం రుణదాత అర్హత కలిగిన సంస్థాగత నియామకం (క్యూఐపి) లేదా, ఏదైనా ఇతర ప్రైవేటు ఈక్విటీ లేదా అప్పు ద్వారా  రూ .10,000 కోట్ల వరకు నిధులను సేకరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే ఈ నిధుల సేకరణపై చర్చించడానికి, అంతకుముందు రూ .800 కోట్లుగా ఉన్న  అధికారిక మూలదనాన్ని రూ .1,100 కోట్లకు విస్తరించేందుకుగాను,  ఫిబ్రవరి 7 న తన వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. 

ట్రెండింగ్ వార్తలు