Starlink India
Starlink India : అతి త్వరలో స్టార్ లింక్ ప్రారంభం కానుంది. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వెంచర్, స్టార్‌లింక్ భారత మార్కెట్లో (Starlink India) అరంగేట్రానికి ఒక అడుగు దూరంలో ఉంది. కంపెనీకి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుంచి తాత్కాలిక స్పెక్ట్రమ్ కేటాయింపు లభించింది. వాణిజ్యపరంగా సేవలను అందించే ముందు టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించాలి.
అధికారుల ప్రకారం.. ఈ కేటాయింపు ఈ నెల ప్రారంభంలో మంజూరు అయింది. స్టార్‌లింక్ సమ్మతి పొందేవరకు 6 నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ముఖ్యంగా, ఈ దశలో స్టార్‌లింక్ కమర్షియల్ శాటిలైట్ కమ్యూనికేషన్ (సాట్‌కామ్) సర్వీసులను అందించేందుకు అనుమతించదు. రిలయన్స్ జియో-SES భారతీ ఎయిర్‌టెల్ సపోర్టుతో వన్‌వెబ్‌లు తమ శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లను పరీక్షించడానికి అక్టోబర్ 2024లో ఇలాంటి తాత్కాలిక స్పెక్ట్రమ్ కేటాయింపులను పొందాయి.
ముఖ్యంగా, తాత్కాలిక స్పెక్ట్రమ్‌ను పొందే కంపెనీలకు DoT కఠినమైన నిబంధనలను విధించింది. నెట్‌వర్క్‌లు సురక్షితంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి. ఆపరేటర్లు తమ వైర్‌లెస్ డివైజ్ లను అనధికార చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఉన్న టెలికాం నెట్‌వర్క్‌లలో జోక్యం జరిగితే సమస్యలు పరిష్కరించేంతవరకు వారు వెంటనే కార్యకలాపాలను నిలిపివేయాలి.
భారత్‌లో స్టార్‌లింక్ లాంచ్ టైమ్‌లైన్, లభ్యత :
స్టార్‌లింక్ ప్రారంభానికి నియంత్రణ అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. మౌలిక సదుపాయాల సహకారం దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. స్టార్‌లింక్ రాబోయే నెలల్లో సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది. స్టార్‌లింక్ లాంచ్ ముందు ఇంకా కొన్ని కీలక ఆమోదాలు పొందాల్సి ఉంది.
ఇందులో సాట్‌కామ్ గేట్‌వేలకు లైసెన్స్‌లు, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్, నెట్‌వర్కింగ్ డివైజ్ ల కోసం స్పెక్ట్రమ్ రైట్స్ ఉన్నాయి. క్లియర్ అయిన తర్వాత స్టార్‌లింక్ భారత మార్కెట్లో సర్వీసులను అందించనుంది. అయినప్పటికీ అధికారిక ప్రారంభ తేదీ ఇంకా ప్రకటించలేదు.
స్టార్‌లింక్ స్పీడ్, ప్లాన్లు :
లొకేషన్, సిగ్నల్ బట్టి స్టార్‌లింక్ 25Mbps నుంచి 220Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ అందించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ధర, ప్లాన్ల వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే, స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వన్ టైమ్ సెటప్ ఖర్చు భారత మార్కెట్లో దాదాపు రూ. 30వేలు ఉంటుందని అంచనా.
అంతేకాకుండా, ఈ సర్వీసు కోసం ప్లాన్లు నెలకు రూ. 3,300 ప్రారంభ ధరకు అందుబాటులో ఉన్నాయి. స్టార్‌లింక్ 2026లో నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్లను ప్రయోగించడానికి కూడా సన్నాహాలు చేస్తోంది, శాటిలైట్ 1,000Gbps వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.