బోర్డర్ లో యుద్ధ వాతావరణం : పాక్ స్టాక్ మార్కెట్ ఢమాల్

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 09:36 AM IST
బోర్డర్ లో యుద్ధ వాతావరణం : పాక్ స్టాక్ మార్కెట్ ఢమాల్

Updated On : February 27, 2019 / 9:36 AM IST

కరాచీ : దాయాది దేశాలైన భారత్..పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్ ఎటాక్..ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేయడంలాంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనటంతో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు  తీవ్రంగా నష్టపోయాయి. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 100 ఇండెక్స్ ఏకంగా 1290 పాయింట్లు కోల్పోయింది. స్టాక్ మార్కెట్స్ లాభనష్టాలు అనేవి సర్వసాధారణమైనా గత 55 రోజుల్లో  ఈ స్థాయిలో మార్కెట్ కుప్పకూలడం ఇదే ప్రథమం కావటం గమనించాల్సిన విషయం. రెండు  దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ స్టాక్ మార్కెట్లు మరింత కుప్పకూలే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
 

పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 2,000 పాయింట్లు పడిపోవడం గమనార్హం. ప్రస్తుతం కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ (కేఎస్‌ఈ 100) 1,476 పాయింట్ల నష్టంతో 37,345 వద్ద ట్రేడవుతుండగా..దాదాపు 3 శాతం పతనమైంది. 

2017 జూలై 11 నుంచి చూస్తే స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. అప్పుడు ఇండెక్స్ 4.65 శాతం మేర పడిపోయింది. షరీఫ్ కుటుంబంపై మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి దర్యాప్తునకు అక్కడి సుప్రీం కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయడం ఇందుకు కారణం. కాగా 26న  కేఎస్‌‌ఈ 100 ఇండెక్స్ 880 పాయింట్లమేర పడిపోయింది. ఇంట్రాడేలో 38,726 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అయితే చివరకు కొంత కోలుకుంది. 785 పాయింట్ల నష్టంతో 38,821 వద్ద ముగిసింది. పుల్వామా ఉగ్రడాది నుంచి చూస్తే ఈ ఇండెక్స్ 6 శాతం మేర పడిపోయింది.