ఇండియాపై మెక్సికో 50 శాతం టారిఫ్‌ల వల్ల మన దేశంలో అత్యధికంగా దెబ్బతినే రంగం ఇదే..

భౌగోళికంగా చాలా దూరంగా ఉన్నప్పటికీ భారత్-మెక్సికో మధ్య వాణిజ్యం అధికంగా కొనసాగుతోంది.

ఇండియాపై మెక్సికో  50 శాతం టారిఫ్‌ల వల్ల మన దేశంలో అత్యధికంగా దెబ్బతినే రంగం ఇదే..

Updated On : December 12, 2025 / 3:04 PM IST

Mexico tariffs: భారత్ సహా ఇతర ఆసియా దేశాల నుంచి చేసుకునే కొన్ని దిగుమతులపై 50 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తూ మెక్సికో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అమెరికా చేసిన ఒత్తిడి మేరకు మెక్సికో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చర్యను మెక్సికోలోని స్థానిక వ్యాపార వర్గాలు వ్యతిరేకించినా, అధిక టారిఫ్‌లు ఖర్చులు పెంచుతాయని హెచ్చరించినా ఆ దేశ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గలేదు. (Mexico tariffs)

కొత్త టారిఫ్‌లు ఆటో పార్ట్స్‌, లైట్ కార్లు, బొమ్మలు, దుస్తులు, వస్త్రాలు, ప్లాస్టిక్‌లు, ఫర్నిచర్‌, చెప్పులు, స్టీల్‌, గృహోపకరణాలు, తోలు వస్తువులు, అల్యూమినియం, కాగితం, గాజు, సబ్బులు, కార్డ్‌బోర్డు, మోటార్‌సైకిళ్లు, సుగంధాలు, కాస్మెటిక్స్‌పై అమల్లోకి వచ్చాయి.

Also Read: కెమెరా లేని ఐఫోన్‌ చూశారా? అందరూ వాడే ఐఫోన్ల కన్నా చాలా కాస్ట్‌లీ.. ఫీచర్లు ఏంటి? ఎక్కడ వాడతారో తెలుసా?

భారత్‌లో ఆటోమొబైల్ రంగంపై భారీగా ప్రభావం
భౌగోళికంగా చాలా దూరంగా ఉన్నప్పటికీ భారత్-మెక్సికో మధ్య వాణిజ్యం అధికంగా కొనసాగుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) డేటా ప్రకారం.. ఈ వాణిజ్యం 2019-20లో 7.9 బిలియన్ డాలర్ల నుంచి 2023-24లో 8.4 బిలియన్ డాలర్లకు పెరిగింది.

కొత్త టారిఫ్‌లు అనేక వర్గాలను ప్రభావితం చేస్తున్నా.. ఆటోమొబైల్ రంగంపై ప్రభావం భారీగా ఉంది. కార్లపై దిగుమతి పన్ను 20 శాతం నుంచి 50 శాతానికి పెరగడం వల్ల.. మెక్సికోకు భారీగా ఎగుమతులు చేసే వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్, నిస్సాన్, మారుతి సుజుకి వంటి సంస్థలకు బలమైన దెబ్బ తగిలింది.

వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్, నిస్సాన్ వంటివి భారతీయ కంపెనీలు కాకపోయినప్పటికీ మన దేశంలో వాటి తయారీ యూనిట్లు, ప్లాంట్లు ఉండటం వల్ల ఇక్కడి నుంచి మెక్సికోకు కార్లను పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తాయి.

వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ వంటి భారతీయ కార్ల ఎగుమతిదారుల నుంచి మెక్సికోకు వెళ్లే 1 బిలియన్ డాలర్ల విలువైన షిప్మెంట్‌లు ప్రభావితమవుతున్నాయని రాయిటర్స్‌ తెలిపింది.

వాణిజ్య మంత్రిత్వ శాఖకు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్‌ ( భారత ఆటో పరిశ్రమ సంఘం) లేఖ రాసి టారిఫ్‌లు యథాతథంగా ఉంచాలని మెక్సికోపై ఒత్తిడి చేయాలని చెప్పింది. ఈ టారిఫ్‌లు భారత ఆటో ఎగుమతులను నేరుగా ప్రభావితం చేస్తాయని, మెక్సికోతో చర్చలు జరపాలని తెలిపింది.

కార్ల తయారీ సంస్థలు, భారత ఆటో పరిశ్రమ సంఘం, భారత ప్రభుత్వం తదుపరి ఏ చర్యలు తీసుకుంటాయో స్పష్టత రాలేదు. భారత కార్లకు సౌతాఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత మెక్సికో మూడో అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఉత్పత్తి గరిష్ఠ స్థాయిలో ఉండేందుకు, ఎకానమీ ఆఫ్ స్కేల్ సాధించేందుకు ఈ ఎగుమతులు కీలకం. దేశీయ విక్రయాలు తగ్గినప్పుడు మార్జిన్లు నిలబెట్టేందుకు కూడా ఇవి ఉపయుక్తం. ఇప్పుడు ఈ వ్యూహాలన్నీ మార్చాల్సి రావచ్చు.

స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ భారత యూనిట్ అధినేత పీయుష్ అరోరా దీని గురించి మాట్లాడుతూ.. భారత్ నుంచి 40కి పైగా దేశాలకు ఎగుమతులు కొనసాగుతున్నాయని తెలిపారు. మెక్సికో ఎప్పటినుంచో ముఖ్యమైన మార్కెట్ అని చెప్పారు.

గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి మెక్సికోకు 5.3 బిలియన్ డాలర్ల సరుకులు పంపగా, వాటిలో కార్లు దాదాపు 1 బిలియన్ డాలర్ల విలువ ఉన్నాయి. భారత్ నుంచి మెక్సికోకు వెళ్లే మొత్తం కార్లలో సగటు 50 శాతం స్కోడా ఆటోవే. హ్యుందాయ్ 200 మిలియన్ డాలర్ల కార్లు, నిస్సాన్ 140 మిలియన్ డాలర్ల కార్లు, సుజుకి 120 మిలియన్ డాలర్ల కార్లు ఎగుమతి చేశాయి.

చాలా ఎగుమతులు ఒక లీటర్ కన్నా తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కాంపాక్ట్ మోడళ్లే అని, ఇవి మెక్సికో మార్కెట్‌కే అనుగుణంగా తయారు చేస్తారని తయారీదారులు ప్రభుత్వానికి తెలిపారు.

భారత కార్లు మెక్సికో స్థానిక పరిశ్రమకు ముప్పుకాదు. ఎందుకంటే అవి ఉత్తర అమెరికా మార్కెట్ కోసం మెక్సికో తయారు చేసే హైఎండ్ మోడళ్లకు పోటీ కాదు.

మెక్సికోలో సంవత్సరానికి 1.5 మిలియన్ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవుతాయి. వాటిలో రెండింట మూడొంతులు దిగుమతులు చేసుకున్నవే. వాటిలో భారత్ వాటా 6.7 శాతం మాత్రమే.