బాబోయ్ బంగారం ధర!!

బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఖాసిం సులేమానీ హతంతో అమెరికాపై ప్రతీకారేచ్చతో రగిలిపోతుంది ఇరాన్. ఫలితంగా బంగారంతో పాటు ముడి చమురు ధరలు ఆకాశానికంటుతున్నాయి. ఈ ప్రభావంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోంది. సోమవారం డాలర్‌ విలువ ఒకదశలో రూ.72.11కు చేరినా, చివరకు రూ.71.93 వద్ద స్థిరపడింది.

సోమవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర తెలుగు రాష్ట్రాల బులియన్‌ ట్రేడింగ్‌ విపణుల్లో రూ.42వేల 200కు చేరింది. వెండి ధర కూడా ఇదే బాటలో నడిచి కిలో రూ.49వేల 200 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రాత్రి 11 గంటల సమయానికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్సు 1565 డాలర్లకు దిగిరావడంతో, దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కూడా రూ.41వేల 750 వద్ద నిలిచింది. వెండి కిలో రూ.48వేల 500 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 916 కేడీఎం బంగారం ధర 10 గ్రాములకు రూ.38వేలుగా ఉంది.

బంగారం ధర పెరిగిపోతుండటంతో కొత్త ఆభరణాలు చేయించుకోవడం కంటే మార్పిడే ఎక్కువైంది. వివాహాలు, శుభకార్యాలకు ముహుర్తాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొత్త బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదు. అంతర్జాతీయంగా ఉపశమన చర్యలు ఫలిస్తే, పసిడి 10 గ్రాములు రూ.40వేలు సమీపానికి, వెండి రూ.47,000 స్థాయికి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.