×
Ad

Union Budget 2026 : టాక్స్ పేయర్లలో టెన్షన్.. టెన్షన్.. బడ్జెట్ 2026లో పాత పన్ను విధానం రద్దు? నిపుణులు అంచనాలివే..!

Union Budget 2026 : 2026-27లో పన్ను చెల్లింపుదారుల్లో ఒకటే ప్రశ్న.. పన్ను ఉపశమనం లభిస్తుందా? మినహాయింపులు ఉంటాయా? లేదా? కేంద్ర ప్రభుత్వం ఈసారి పాత ఆదాయపు పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Union Budget 2026

Union Budget 2026 : ఫిబ్రవరి 1నే కేంద్ర వార్షిక బడ్జెట్.. బడ్జెట్ 2026-27 దగ్గరపడుతున్నా కొద్దీ పన్ను చెల్లింపుదారుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వైపు పన్ను ఉపశమనం, మరిన్ని మినహాయింపుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈసారి కేంద్ర ప్రభుత్వం పాత ఆదాయపు పన్ను వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తుందా లేదా అనేదానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం, దేశంలో పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం రెండూ అందుబాటులో ఉన్నాయి, పన్ను చెల్లింపుదారులు అవసరాల ఆధారంగా ఎంచుకోవచ్చు.

పాత పన్ను విధానం రద్దుపై తీవ్ర చర్చ :
గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ ఆప్షన్ చేస్తారు. అంటే.. ఇకపై పన్ను చెల్లింపుదారులు స్వయంగా ఈ ఆప్షన్ ఎంచుకోకపోతే కొత్త పన్ను విధానం ఆటోమాటిక్‌గా వర్తిస్తుంది. భవిష్యత్తులో పాత పన్ను విధానాన్ని రద్దు చేయవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, పాత పన్ను విధానం 2026 బడ్జెట్‌లో రద్దు చేసే అవకాశం లేదని పన్ను నిపుణులు భావిస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారంటే? :
నిపుణుల ప్రకారం.. పాత పన్ను విధానం ఇప్పటికీ భారీ సంఖ్యలో టాక్స్ పేయర్లకు ముఖ్యంగా సిటీల్లో అధిక అద్దెలు చెల్లించే వారికి వర్తిస్తుంది. వారికి, HRA (ఇంటి అద్దె భత్యం) మినహాయింపు అనేది పాత పన్ను విధానం కింద మాత్రమే ఉంది.

పాత పన్ను విధానంలో ఇలా :

  • రూ. 2 లక్షల వరకు గృహ రుణ వడ్డీ రాయితీ
  • సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా
  • ఆరోగ్య బీమా (80D)
  • విద్యా రుణ వడ్డీ (80E)

ఎల్ఐసీ, పీపీఎఫ్, ఎల్ఈఎస్ఎస్ వంటి పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందవచ్చు. కొత్త పన్ను విధానంలో ఈ ఉపశమనాలు లేకుండా పాత విధానాన్ని రద్దు చేస్తే మధ్యతరగతిపై అదనపు పన్ను భారం పడుతుందని నిపుణులు అంటున్నారు.

Read Also : ఉచితాలు ఎత్తేస్తారా? లేక మార్చేస్తారా? ఆర్థిక సర్వేలో కేంద్రం ఏం చెప్పింది?

కొత్త పన్ను విధానం బెనిఫిట్స్ ఏంటి? :
కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లు చాలా ఈజీగా ఉంటాయి. పన్ను రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. రూ. 12 లక్షల వరకు సాధారణ ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు. అధిక తగ్గింపులు, పేపర్ వర్క్ అవసరం ఉండదు.

కొత్త పన్ను విధానం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆటోమాటిక్‌గా వర్తిస్తుంది. జీతం పొందే వ్యక్తులు తమ ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. కానీ, వారు తమ ఐటీఆర్‌ను ఆలస్యంగా దాఖలు చేస్తే మాత్రమే కొత్త పన్ను విధానాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

కొత్త పన్ను విధానం : పన్ను స్లాబ్‌లివే :

  • రూ. 0 నుంచి రూ. 4 లక్షలు : పన్ను లేదు
  • రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షలు : 5 శాతం
  • రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలు : 10 శాతం
  • రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలు : 15 శాతం
  • రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షలు : 20 శాతం
  • రూ. 20 లక్షల నుంచి రూ.24 లక్షలు : 25 శాతం
  • రూ. 24 లక్షలకు పైగా : 30 శాతం

పాత పన్ను విధానం ఎవరికి బెటర్? :
డబ్బు ఆదా చేయాలని చూసే టాక్స్ పేయర్లకు పాత పన్ను విధానం అద్భుతంగా ఉంటుంది. సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి, HRA, LTA గృహ రుణ వడ్డీ, ఆరోగ్యం, విద్య ఖర్చులపై మినహాయింపులు పొందవచ్చు. అందుకే సీనియర్ సిటిజన్లు, అధిక మినహాయింపులను కోరుకునే వారు ఇప్పటికీ పాత పన్ను విధానాన్నే ఇష్టపడతారు.

ఏ పన్ను విధానాన్ని ఎవరు ఎంచుకోవాలి? :
మీ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు ఉండి.. ఎక్కువ మినహాయింపులను క్లెయిమ్ చేయకపోతే కొత్త పన్ను విధానం బెటర్ అని పన్ను నిపుణులు చెబుతున్నారు. మీరు HRA, గృహ రుణాలు, PPF, ELSS, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి మినహాయింపులను క్లెయిమ్ చేస్తే పాత పన్ను విధానమే బెటర్ అని అంటున్నారు.

బడ్జెట్ 2026 భారీ అంచనాలివే :
ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం రెండు పన్ను విధానాలను కొనసాగించే అవకాశం ఉంది. కొత్త పన్ను వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉంది. కానీ, పాత పన్ను విధానాన్ని వెంటనే రద్దు చేసే పరిస్థితి లేదు. బడ్జెట్ 2026లో పన్ను చెల్లింపుదారులకు ఎంతవరకు రిలీఫ్ ఇస్తుందో చూడాలి..