Vodafone-idea to finally roll out 5G services in India, here are the details
Vodafone-idea 5G Rollout : భారత మార్కెట్లో 5G నెట్‌వర్క్ విస్తరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తమ 5G సర్వీసులను ప్రారంభించాయి. కానీ, మరో అతిపెద్ద పోటీదారు వోడాఫోన్ ఐడియా (Vodafone-Idea) మాత్రం దేశంలో తమ 5G సర్వీసులను ప్రారంభించలేదు. ఎప్పటినుంచో 5G సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న వోడాఫోన్ ఐడియా కస్టమర్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారత మార్కెట్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది.
ఆదిత్య బిర్లా గ్రూప్ (Aditya Birla Group) చైర్‌పర్సన్ కుమార్ మంగళం బిర్లా (Kumar Mangalam Birla) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వోడాఫోన్-ఐడియా 5G సర్వీసులను త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆయన ధృవీకరించారు. వోడాఫోన్-ఐడియా (Vi) తమ సబ్‌స్క్రైబర్ బేస్‌ను వేగంగా కోల్పోతున్న తరుణంలో కంపెనీ ఈ దిశగా నిర్ణయాన్ని వెల్లడించింది.
రాబోయే 5G సర్వీసుల కోసం వోడాఫోన్ ఐడియా (Motorola), (Xiaomi) వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం, వోడాఫోన్ భారత మార్కెట్లో 4G సర్వీసులను మాత్రమే అందిస్తోంది. దేశంలో 5G సర్వీసులను ఇంకా ప్రవేశపెట్టని ఏకైక టెలికాం కంపెనీ కూడా ఇదే. జియో, ఎయిర్‌టెల్ రెండూ ఇప్పటికే తమ సబ్‌స్క్రైబర్‌ల కోసం 5G సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి.
Vodafone-idea 5G Rollout : to finally roll out 5G services in India, here are the details
వోడాఫోన్-ఐడియా (Vi) భారత్‌లో 5G సర్వీసులను రిలీజ్ చేయనున్నట్టు బిర్లా ధృవీకరించగా.. ఎప్పటినుంచి అనేది మాత్రం కచ్చితమైన తేదీని వెల్లడించలేదు. దేశంలో త్వరలో Vi 5G నెట్‌వర్క్ ప్రారంభించనున్నట్టు బిర్లా వెల్లడించారు. ఏప్రిల్ 2021 నుంచి (Vodafone-idea) 42.4 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది, డిసెంబర్ 2022తో ముగిసే 12 నెలల వ్యవధిలో 24.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్-బేస్ ఎరోషన్‌ను చూసింది. డిసెంబర్ 31, 2022తో మూడవ త్రైమాసికం ముగిసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 7,595.5 కోట్ల నికర నష్టంతో పోలిస్తే.. Vi రూ. 7,990 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
డిసెంబర్ త్రైమాసికంలో (Vi) మొత్తం ఆదాయం రూ.10,620.6 కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్ త్రైమాసికంలోనూ రూ.10,614.6 కోట్ల నుంచి 0.1 శాతం వృద్ధి చెందింది. Vi పోటీదారుల్లో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో 5G సర్వీసులను ప్రారంభించగా.. వోడాఫోన్ ఐడియా మాత్రం వెనుకబడింది.
ఏది ఏమైనప్పటికీ.. త్వరలో 5G సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు వోడాఫోన్ ఐడియా ప్రకటించడం కస్టమర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తద్వారా కోల్పోయిన యూజర్ బేస్ తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. 2022లో 5G స్పెక్ట్రమ్‌ను వేలం వేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ప్రణాళికలను ప్రకటించింది.