డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి నెలలోనే అంతర్జాతీయంగా బంగారం ధర రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88 వేలకు దగ్గరలో ఉంది.
గత ఏడాది బంగారం ధర 27 శాతం పెరిగితే ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇది 12 శాతం పెరిగింది. దీనిని బట్టి భవిష్యత్తులో మరింత పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు నిపుణులు.
న్యూయార్క్‌లో బంగారానికి భారీ డిమాండ్ ఉంది. ప్రపంచ బంగారం ఫ్యూచర్స్ మార్కెట్ కేంద్రంగా ఉన్న న్యూయార్క్‌లో ఉన్న వాల్ట్‌ల (బంగారాన్ని నిల్వ చేసే ప్రదేశం) నుంచి లండన్‌కి బంగారం తరలించడానికి కూడా ఎక్కువ సమయం పడుతోంది.
బంగారంపై పెట్టుబడిని ‘సురక్షిత ఆస్తి’ గా పరిగణిస్తారు. అయితే, ప్రస్తుతం అమెరికా స్టాక్ మార్కెట్లు ఎలాంటి పతనం లేకుండా రికార్డులను సృష్టిస్తున్నాయి. అలాగే ‘లేబర్ మార్కెట్’ కూడా బలంగా ఉంది. అయినప్పటికీ, టారిఫ్, వలస దారులను అమెరికా నుంచి పంపేయడం వంటి ట్రంప్ విధానాల వల్ల అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి బంగారం కొనుగోళ్లు పెరిగాయి అన్ని దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ట్రంప్ మరికొన్ని దేశాలపై టారిఫ్‌లను విధించబోతున్నారని చెప్పడం, అంతర్జాతీయ వాణిజ్య నియమాలను మారుస్తుందనే భయాలను కలిగించింది. ఒకవేళ అమెరికా పూర్తీ స్థాయిలో సుంకాలు విధించడం మొదలైతే.. బంగారమే అత్యుత్తమ పెట్టుబడి అవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా చేసిన సర్వేలో పెట్టుబడిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
భవిష్యత్తులోనూ దూసుకుపోనున్న బంగారం ధర
బంగారం దిగుమతులపై టారిఫ్‌లు విధించవచ్చనే భయంతో అమెరికాలో బంగారం నిల్వ పెరుగుతోంది. న్యూయార్క్‌లోని కమోడిటీ ఎక్స్చేంజ్ వద్ద బంగారం నిల్వ ఈ సంవత్సరం 70 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో 2025 చివరికి బంగారం ధర ట్రోయ్ ఔన్సుకు $3,000 దాటవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. 2022 నుంచి ప్రతి సంవత్సరం కేంద్ర బ్యాంకులు 1,000 మెట్రిక్ టన్నులకుపైగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి.
ఈ కొనుగోళ్లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా చైనా, భారతదేశం, టర్కీ, పోలాండ్ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచాయి. పోలాండ్ తన విదేశీ నిల్వల్లో బంగారం వాటాను 20 శాతానికి పెంచాలని చూస్తోంది
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, రష్యా కేంద్ర బ్యాంక్‌కు చెందిన డాలర్, యూరో నిల్వలను గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్‌లో ఫ్రీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఇతర దేశాలు తమ నిల్వలను డాలర్‌కు బదులుగా బంగారం రూపంలో మార్చుకోవాలనే ఆలోచన చేస్తున్నాయి.
ఈ కారణాల వల్ల బంగారం విలువ మరింత పెరుగుతుందన్న నిపుణుల అంచనాలు వేస్తున్నారు. బంగారం భద్రత కలిగిన పెట్టుబడిగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని ప్రాముఖ్యత పెరిగే అవకాశం ఉంది.