Gold Rate: గోల్డ్ ప్రియులకు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు.. కారణాలు ఇవే.. డబ్ల్యూజీసీ సంచలన నివేదిక
బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. త్వరలో గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది.

Gold
Gold Rate: బంగారం ధరలు మధ్యతరగతి ప్రజలకు షాక్‌ల మీద షాకిస్తున్నాయి. గత నెల చివరిలో తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు ఈ నెల ప్రారంభం నుంచి మళ్లీ పెరుగుతోంది. దీంతో సరికొత్త రికార్డులను నమోదు చేసే దిశగా దూసుకెళ్తుంది.
గత నెలలో రూ. 90వేలకు పడిపోయిన తులం గోల్డ్ రేటు.. ప్రస్తుతం రూ.లక్షకు చేరువైంది. దీంతో బంగారం కొనుగోళ్లపై మధ్య తరగతి ప్రజలు ఆశలు వదులుకుంటున్నారు. అయితే, వారికి ఊరట కలిగించేలా త్వరలో బంగారం ధరలు భారీగా తగ్గబోతున్నాయట. ఈ మేరకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది.
2022 నవంబర్ తరువాత నుండి బంగారం ధర రెట్టింపు అయింది. అప్పట్లో కనిష్ఠ ధర ఔన్సుకు 1,429 డాలర్ల నుంచి ప్రస్తుతం 3,300 డార్లకు చేరింది. అంటే ఏడాదికి 30శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. ఓ వైపు కేంద్ర బ్యాంకు బంగారం కొనుగోళ్లతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా టారిఫ్ ల వల్ల వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడతాయనే భయాల నేపథ్యంలో సురక్షితమని భావించే బంగారంలోకి పెట్టుబడుల ప్రవాహానికి కారణమయ్యాయి.
అయితే, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు క్రమంగా తొలగిపోతున్నాయి. దీంతో మరికొద్ది రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు నిదానించడం, వ్యక్తిగత కొనుగోళ్లు తగ్గడమూ బంగారం ధరలు దిగివచ్చేందుకు కారణమవుతాయని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. అయితే, దీర్ఘకాలంలో పసిడి ధరలు దిగిరావాలంటే మరిన్ని సంస్థాగత మార్పులు అవసరమని, విపరీతంగా పెరిగిన ధరల నేపథ్యంలో గిరాకీ రూపంలో మధ్యకాలానికి ధరలు దిగిరావచ్చని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది.