ఆన్ లైన్ క్లాసులు అర్ధం కాక విద్యార్ధిని ఆత్మహత్య

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో..అధిక శాతం విద్యా సంస్ధలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాయి. అయితే ఆన్ లైన్ క్లాసుల వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. పిల్లలకు అవసరంమైన స్మార్ట్ ఫోన్లు కొనివ్వలేని తల్లి తండ్రులు కొందరు ఉంటే లాప్ టాప్ లు కొనివ్వలేని నిరుపేదలు కొందరు ఉన్నారు.
ఫోన్లు, ల్యాప్ టాప్ లు కొనివ్వలేదని మనస్తాపంచెంది ఆత్మహత్య చేసుకున్నవిద్యార్ధులు కొందరు ఉన్నారు. కానీ తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా లోఆన్ లైన్ క్లాసులు అర్ధంకాక ఒక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.
తమిళనాడులోని తిరవల్లూరు జిల్లా పొన్నెరీ అరుమంతై గ్రామంలో ఆన్ లైన్ క్లాసులు అర్ధంకాక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని భారతీ ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని దర్శిని…… ఆన్ లైన్ క్లాసులు వింటోంది.
అయితే ఆ క్లాసులు తనకు అర్థం కావడం లేదంటూ తల్లికి చెబుతూ వచ్చింది. నిదానంగా అర్థం అవుతాయిలేమ్మా అని తల్లి సర్ది చెప్పినా ఫలితం లేకపోయింది. క్లాసులు అర్థం కావడం లేదని, అందరిలా తాను చదువుకోలేకపోతున్నాననే మనస్తాపంతో దర్శిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చోళవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.