Pondy Co op bank Cashiers
Pondicherry Co-operative Urban Bank : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టారు ఆ ఉద్యోగులు. బ్యాంకులో క్యాషియర్, అసిస్టెంట్ క్యాషియర్‌గా పని చేసే ఇద్దరు వ్యక్తులు బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు నగల స్ధానంలో గిల్టు నగలు పెట్టి ఒరిజినల్ నగలు దొంగిలించిన ఘటన పాండిచ్చేరిలో చోటు చేసుకుంది.
స్ధానిక లాస్ పేట్ లోని కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఒక ఖాతాదారుడు తన వద్ద ఉన్న బంగారు నగలు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. రుణం తీర్చి బంగారు నగలు తీసుకువెళ్దామని ఇటీవల బ్యాంకుకు వచ్చాడు. అయితే తాను ఇచ్చిన బంగారు నగల స్ధానంలో రోల్డ్ గోల్డ్ నగలు ఉండటంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీంతో ఈవిషయమై బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
Also Read : Special Trains For Pongal : సంక్రాంతి పండగకి ప్రత్యేక రైళ్లు
ఈ మేరకు అధికారులు బ్యాంకులో ఉన్న బంగారు నగలను అన్నీ పరీక్షించసాగారు. దీంతో దాదాపు నాలుగు వందల సవర్ల బంగారు ఆభరణాల స్ధానంలో గిల్టు నగలు ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్యాషియర్ గణేశన్, అసిస్టెంట్ క్యాషియర్ విజయకుమార్ లను అదుపులోకి తీసుకుని రూ. 1.19 కోట్ల విలువైన ఒరిజినల్ బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
వీరిద్దరూ ఒరిజినల్ నగలను వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టుపెట్టి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు ఉద్యోగులపై ఐపీసీ సెక్షన్ 407,420,380 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బ్యాంకులోని ఇంకెవరికైనా ఉద్యోగులకు ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.