జూడాల ఆందోళన ప్రభావం ఓ కుటుంబంలో విషాదం నింపింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నీళ్లు పెట్టించే ఈ విషాద ఘటన బుధవారం(ఫిబ్రవరి-27,2019) హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో జరిగింది.
మల్కాజ్ గిరిలోని హిల్ టాప్ కాలనీకి చెందిన శశికళ,సతీష్ దంపతుల రెండేళ్ల కుమారుడు స్టీఫెన్ బుధవారం జారిపోయి సంపులో పడిపోయాడు. తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులిద్దరూ కొనప్రాణంతో ఉన్న చిన్నారిని బైక్ పై ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని,గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని డాక్టర్లు తల్లిదండ్రులకు సూచించడంతో అక్కడికి వెళ్లారు.జూడాల ఆందోళన కారణంగా పోలీసులు హాస్పిటల్ ప్రధాన ద్వారాలన్నీ మూసివేశారు. అయితే అప్పటికే చిన్నారి నోటి నుంచి నురుగ రావడంతో ఆ తల్లి రెండు గేట్ల దగ్గరకు వెళ్లి తీయాలని సిబ్బందిని ప్రాధేయపడింది. ఎవ్వరూ స్పందించకపోవడంతో చివరికి ఓపీలోని ఎమర్జెన్సీ గేటు ద్వారా వెళ్లి డాక్టర్లకు చూపించగా చిన్నారి అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. తమ చేతిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంపై చిన్నారి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.