మాస్క్‌లను ఎక్కువ రేట్లను అమ్మినందుకు రూ.20 వేల ఫైన్

  • Publish Date - March 10, 2020 / 06:03 AM IST

ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు భయపడి చస్తుంటే ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో ప్రతి ఒక్కరూ మాస్క్ లు కొని ధరిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారస్తులు అధిక ధరలకు మాస్క్ లు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. హైదరాబాద్ లో వినియోదగదారులు చేసిన ఫిర్యాదుతో రెండు మందులషాపులపై అధికారులు కేసులు నమోదు చేశారు. 

శేరిలింగంపల్లిలో అధిక ధరలకు మాస్క్‌లు విక్రయిస్తున్న మెడికల్‌ షాప్‌ యజమానికి రూ.20 వేలు జరిమానా విధించినట్లు శేరిలింగంపల్లి సర్కిల్‌–21 ఉప వైద్యాధికారి డాక్టర్‌ రంజిత్‌ తెలిపారు. అంజయ్యనగర్‌లోని సాయిదుర్గ మెడికల్‌ స్టోర్‌లో కరోనా సాకుతో మాస్క్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు డ్రగ్‌ కంట్రోల్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. 

ఇక్కడ సాధారణ మాస్కు రూ.20కి, నాలుగు లేయర్ల రూ.80 మాస్కు రూ.300కు, రూ.40 శానిటైజర్ రూ.160కి, రూ.80ది రూ.200కి  అమ్ముతున్నట్లు జడ్సీ రవికిరణ్ కి ఫిర్యాదులందాయి. దీంతో ఉప వైద్యాధికారి రంజిత్, సిబ్బంది మెడికల్‌ స్టోర్‌ యజమానికి రూ.20 వేలు జరిమానా విధించారు. మంగళవారం నుంచి మెడికల్‌ స్టోర్లపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని తెలిపారు. అధిక ధరకు విక్రయిస్తే ట్రేడ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

కూకట్ పల్లి ఏరియాలో అధిక ధరలకు మాస్క్‌లు విక్రయిస్తున్న మెడికల్‌ షాపులపై ఫోరం ఫర్‌ అగెనెస్ట్‌ కర ప్షన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ కాట్రగడ్డ సాయితేజ కూకట్‌పల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.   బాలాజీనగర్‌లోని మారుతి మెడికల్‌ షాపు వద్దకు వెళ్లి మాస్క్‌లు కొనుగోలు చేయగా సుమారు 30 నుంచి 80 రూపాయల వరకు ఎక్కువ ధరకు విక్రయించారు.   

మరోక మెడికల్‌ షాపు శ్రీసాయి మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌కు వెళ్లి మాస్క్‌లు కొనుగోలు చేయగా అక్కడ కూడా అధిక ధరలకు విక్రయించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  పోలీసులు  విచారించగా అధిక ధరలకు మాస్కులు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి 18 మాస్క్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.నిందుతులపై 41 ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసినట్లు కూకట్ పల్లి సీఐ బి.లక్ష్మి నారాయణ రెడ్టిచెప్పారు.