India's biggest car thief
India’s biggest car thief: అతడొక ఆటోడ్రైవర్.. కానీ, ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయి. అతడి చరిత్రను తోడి చూస్తే మరిన్ని భయానక నిజాలు బయటపడ్డాయి. అతడు దేశం మొత్తం తిరుగుతూ ఇప్పటివరకు ఏకంగా 5 వేల కార్లు చోరీ చేశారు. కొందరిని హత్య చేశాడు. అతడికి ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. ఆయుధాల అక్రమ రవాణాకు కూడా పాల్పడుతున్నాడు. ఆ ఆటోడ్రైవర్ ను తాజాగా అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపారు.
అతడిని భారత్‌లోని అతి పెద్ద ‘కార్ల దొంగ’గా చెప్పుకోవచ్చు. ఆ ఆటోడ్రైవర్ పేరు అనిల్ చౌహాన్. వయసు 52 ఏళ్ళు. అతడి కోసం కొంత కాలంగా పోలీసులు గాలిస్తున్నారు. ఓ వ్యక్తి ఉప్పందించడంతో ఢిల్లీ పోలీసులు దేశ్ బంధు గుప్తా రోడ్డు ప్రాంతంలో అనిల్ చౌహాన్ ను అరెస్టు చేశారు. అతడు ఉత్తరప్రదేశ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోని నిషేధిత సంస్థలకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.
అనిల్ ఢిల్లీలో ఉంటూ ఆటో నడిపే వాడని, 1995 నుంచి కార్లు చోరీ చేరి అమ్మడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో కార్లు కొట్టేసి నేపాల్, జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు పంపుతున్నాడని చెప్పారు. చోరీ చేసే సమయంలో పలువురు ట్యాక్సీ డ్రైవర్లను కూడా అతడు చంపేశాడని అన్నారు. కొంతకాలం అసోంలో నివసించాడని తెలిపారు.
కొట్టేసిన కార్లను అమ్ముకుని బాగా సంపాదించి లగ్జరీ లైఫ్ గడిపాడని వివరించారు. అంతేకాదు, అతడిపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు కూడా నమోదుచేసింది. అతడు పలు కేసుల్లో 2015లో అరెస్టయి 2020లో విడుదల అయ్యాడు. అనిల్ పై 180 కేసులు ఉన్నాయి. స్థానిక నేతల మద్దతుతో అతడు అసోంలో ప్రభుత్వ కాంట్రాక్టర్ గానూ పనిచేశాడు. అతడి నుంచి పోలీసులు ఆరు తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడిని తాజాగా అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
China vs America: చైనా-అమెరికా పరస్పరం సైబర్ దాడులు?.. అగ్రరాజ్యంపై మళ్ళీ మండిపడ్డ డ్రాగన్