6లక్షలు తెచ్చిందెవరు ? ఇచ్చిందెవరికి ?

  • Publish Date - February 2, 2019 / 12:23 PM IST

హైదరాబాద్: హత్యకు గురవటానికి ముందు చిగురుపాటి జయరాం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్లో బస చేశారు. హోటల్ కు ఒక వ్యక్తి వచ్చి రూ.6లక్షల రూపాయలు ఆయనకు అందచేశాడు. జనవరి 30వ తేదీ సాయంత్రం  వచ్చి డబ్బులు ఇచ్చిన వ్యక్తి  ఎవరు ?  ఆ 6 లక్షలు  ఎందుకు  తెప్పించారు, ఎవరికిచ్చారు ?  అనే కోణంలో  పోలీసులు విచారణ జరుపుతున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి స్వయంగా ఈకేసును విచారిస్తున్నారు. కాగా జయరామ్ అమెరికన్ సిటిజన్ కావడంతో.. దర్యాప్తు తీరుపై అమెరికన్‌ ఎంబసీ ఆరా తీస్తోంది.
జయరామ్ హత్య అటు ఏపీ, ఇటు తెలంగాణలో కలకలం రేపుతోంది. 

కృష్ణాజిల్లా, నందిగామ సమీపంలోని ఐతవరం గ్రామం శివారులో 65వ నెంబరు జాతీయరహదారి పక్కన శుక్రవారం తెల్లవారుజామున జయరామ్ మృత దేహం లభ్యమైంది. హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు వస్తుండగా ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. విజయవాడకు చెందిన జయరామ్.. భార్య పద్మజా ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. ఆయనకు బ్యాంకింగ్, ఫార్మా రంగాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. కృష్టాజిల్లా కేంద్రంగా ఏర్పాటైన కోస్టల్ బ్యాంక్‌కు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.