×
Ad

Doctor Takes Life: దారుణం.. 5 నెలల్లో నాలుగుసార్లు అత్యాచారం.. మహిళా డాక్టర్ ఆత్మహత్య.. చేతిపై సూసైడ్ నోట్

ఈ కేసుపై పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడారు. అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణల కింద వారిపై కేసు నమోదు చేశామన్నారు.

Doctor Takes Life: మహారాష్ట్రలోని సతారాలో దారుణం జరిగింది. ప్రభుత్వ డాక్టర్ ఆత్మహత్య సంచలనం రేపుతోంది. ఎస్ఐ తనను రేప్ చేశాడంటూ చేతిపై సూసైడ్ నోట్ రాసి డాక్టర్ చనిపోయింది. ‘నా చావుకి ఎస్ఐ గోపాల్ కారణం. గత 5 నెలల నుంచి నాలుగుసార్లు రేప్ చేశాడు. శారీరకంగా, మానసికంగా నన్ను వేధిస్తున్నాడు’ అని సూసైడ్ నోట్ లో తెలిపింది. గోపాల్‌తో పాటు మరో పోలీస్ వేధిస్తున్నాడని 3 నెలల క్రితమే ఆమె డీఎస్పీకి లేఖ కూడా రాసింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

సతారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె డాక్టర్ గా పని చేస్తోంది. గురువారం రాత్రి హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఐదు నెలలుగా ఒక పోలీసు అధికారి తనపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆమె తన అరచేతిలో ఒక నోట్ రాసుకుంది.

పోలీసు అధికారి గోపాల్ బదానే 5 నెలల్లో అనేకసార్లు తనపై అత్యాచారం చేశాడని రాసింది. ప్రశాంత్ బంకర్ అనే మరో వ్యక్తి పేరును కూడా ఆమె పేర్కొంది. తనను మానసికంగా వేధించాడని ఆరోపించింది. బంకర్.. డాక్టర్ ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు.

రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పరీక్షకు పంపారు. డాక్టర్ చేతిపై రాసిన సూసైడ్ నోట్ పై ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రారంభించారు. నిందితుడైన పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ కేసుపై పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడారు. అత్యాచారం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణల కింద వారిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు PSIని విధుల నుండి సస్పెండ్ చేశామన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఇద్దరు నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతారా పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. మహిళా వైద్యురాలు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.