Saif Ali Khan Stabbing Case : వాడు వీడేనా? సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మరొకరు అరెస్ట్..

Saif Ali Khan Stabbing Case : సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మరో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్ గఢ్ దుర్గ్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానితుడు జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్ లో వస్తున్నాడని సమాచారం ఇచ్చిన ముంబై పోలీసులు.. ఛత్తీస్ గఢ్ పోలీసులకు ఫోటో పంపించారు. దీంతో రంగంలోకి దిగిన ఛత్తీస్ గఢ్ పోలీసులు అనుమానితుడిని దుర్గ్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు..
మరోవైపు నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనేక చోట్ల జల్లెడ పడుతున్నారు. దాడి చేసిన వ్యక్తి బాంద్రా రైల్వే స్టేషన్ నుంచి మరో ప్రదేశానికి పారిపోయాడని అనుమానిస్తున్న పోలీసులు నిందితుడిని గుర్తించడానికి రైల్వే స్టేషన్లు, ప్రత్యేక ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఆయా చోట్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

సైఫ్ ను పొడిచిన దొంగకు సంబంధించి వెలుగులోకి మరో ఫొటో..
తాజాగా సైఫ్ ను పొడిచిన దొంగకు సంబంధించి మరో ఫోటో వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ ఫొటో బయటపడింది. తాజాగా ఫొటోలో బ్లూ షర్ట్ వేసుకుని సీసీటీవీలో కనిపించాడు. నిందితుడు ముంబైలోనే తిరుగుతున్నా డౌట్ రాకుండా డ్రెస్ మార్చి తిరుగుతున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ని పొడిచిన సమయంలో వేరే డ్రెస్ లో ఉన్న దుండగుడు.. అనంతరం డ్రెస్ మార్చి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడని భావిస్తున్నారు.

Also Read : కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు..

సైఫ్ పై దాడి చేసిన దుండగుడు.. ఆరు చోట్ల గాయాలు..
మూడు రోజుల క్రితం ముంబై బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి దూరిన దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. 6 చోట్ల గాయపరిచాడు. సైఫ్ వెన్నుముక, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే లీలావతి ఆసుపత్రికి సైఫ్ ని తరలించారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతోందని వైద్యులు తెలిపారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. సైఫ్ నడవగలుగుతున్నారని, ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు కొన్నివారాల పాటు విశ్రాంతిని సూచించినట్లు తెలిపారు.

ఆ సమయంలో చాలా కోపంగా ఉన్న దుండగుడు.. ఎందుకు?
మరోవైపు సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ స్టేట్ మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. సైఫ్ పై దాడి గురించి పలు విషయాలు తెలియజేశారు. దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో కోపంగా ఉన్నాడని చెప్పారు. దాదాపు 6 సార్లు కత్తితో సైఫ్ పై దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. అయితే, అతడు ఇంట్లో వస్తువులేవీ దొంగిలించలేదని ఆమె చెప్పారు.

 

Also Read : మొన్న బెదిరింపు కాల్, నిన్న నకిలీ పోలీస్, ఇప్పుడు డ్రోన్.. పవన్ కల్యాణ్ చుట్టూ అసలేం జరుగుతోంది?