Umapathi Death Mystery
Umapathi Death Mystery : అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన దేవరకొండ కారు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇది ప్రమాదమా? ఆత్మహత్యా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థల కరస్పాండెంట్ ఉమాపతి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది.
నగర సమీపంలోని బుక్కరాయ సముద్రం దేవరకొండపై ఉన్న ఆలయంలో దైవ దర్శనానికి ఉమాపతి ప్లాన్ చేసుకున్నారు. తన పూర్వ విద్యార్థి సోమశేఖర్ ను కారు పంపాలని చెప్పడంతో డ్రైవర్ తో వాహనం సమకూర్చాడు. డ్రైవర్ తో కలిసి దర్శనం కోసం వెళ్లారు. కానీ, ఆలయం మూసివేయటంతో బయటి నుంచే దండం పెట్టుకున్నారు.
ఆ తర్వాత తాను ఫోన్ మాట్లాడాలని డ్రైవర్ కు చెప్పిన ఉమాపతి.. వాహనం ఎక్కారు. డ్రైవర్ తన ఫోన్ లో ఆలయ పరిసరాలను ఫోటో తీస్తున్న సమయంలో కారు కదిలి కొండపై నుంచి కింద పడింది. ఉమాపతి శరీరం కాలిపోయింది. అయితే, కారు కాలినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని కొందరు చెప్పారు. దీంతో ఉమాపతి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ, పోలీసులు మాత్రం కారులో కాలిన ఆనవాళ్లు ఉన్నాయంటున్నారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారించారు. విద్యాసంస్థల యజమాని ఉమాపతి కారులో కాలిన గాయాలతో దేవరకొండపై నుంచి పడి మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. కారులో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తికి మంటలు ఎలా వ్యాపించాయి? కారు కిందకి ఎలా పడిపోయింది? అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఇది ప్రమాదమా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.
ఉమాపతికి అప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పులు తీర్చాలంటూ కొంతకాలంగా ఉమాపతిపై అప్పులు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి తెచ్చారు. అప్పుల భారం ఎక్కువై కొన్ని గొడవలు కూడా జరిగినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఆర్థిక లావాదేవీల వివాదాలున్నా.. ఉమాపతి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. ఉమాపతి అనుమానాస్పద మృతి కేసులో ఈ కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఉమాపతికి ప్రతీ శనివారం గుడికి వెళ్లే అలవాటు ఉంది. కానీ, ఈసారి సోమవారం దేవాలయానికి వెళ్లటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.