Ap Cid Raids Retired Ias Lakshminarayana House
AP CID Search : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన అధికారులు… హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని లక్ష్మీ నారాయణ నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు.
లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఓస్డీగా పని చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మొదటి డైరెక్టర్ గా లక్ష్మీ నారాయణ పనిచేశారు. చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు ట్రైనింగ్ ఇచ్చింది.
Also Read : Junior Doctors : ఏపీలో సమ్మె బాట పట్టిన జూడాలు
ట్రైనింగ్ సెంటర్ల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తటంతో ఇప్పటికే లక్ష్మీ నారాయణ మీద సీఐడీ అధికారుల కేసు నమోదు చేశారు. సైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ….జూబ్లీహిల్స్ నవనిర్మాణ్ నగర్ లో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కే.లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆంధ్ర సీఐడీ పోలీసులు తెలంగాణలో ఉన్న అధికారి ఇంటి మీద దాడులు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కక్షపూరిత చర్య లేనని వారు ఆరోపించారు. సిఐడి అధికారులు గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకున్నారు.