బెంగళూరు: బెంగళూరు లోని మెట్రో రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. సోమవారం సాయంత్రం ఒక అనుమానాస్పద వ్యక్తి మెజిస్టిక్ మెట్రో స్టేషన్ లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఆవ్యక్తి తెల్లటి కుర్తా పైజమా ధరించి, పైన కోటు లాంటిది ధరించాడు. సెక్యూరిటీ చెకింగ్ లో భాగంగా సిబ్బంది అతడ్ని మెటల్ డిటెక్టర్ తో చెక్ చేస్తుండగా అతని కోటు కింద అమర్చిన ఎలక్ట్రానిక్ వస్తువు వల్ల బీప్ సౌండ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది అతడ్ని ప్రశ్నించేందుకు యత్నించగా అతను తప్పించుకు పారిపోయాడు.
అంతకు ముందు ఆవ్యక్తి మెటల్ డిటెక్టర్ ఉన్న గేటు ద్వారా లోపలకు వెళ్లాలని ప్రయత్నించగా, అక్కడ బీప్ సౌండ్ రావటంతో వేరే మార్గం ద్వారా వెళ్ళాలని ప్రయత్నించాడు. ఆ మార్గంలో హ్యాండ్ మెటల్ డిటెక్టర్ ద్వారా చేస్తుండగా మళ్లీ బీప్ సౌండ్ వచ్చింది. సిబ్బంది అప్రమత్తమయ్యేలోపు ఆ వ్యక్తి పరారయ్యాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ అధికార ప్రతినిధి యశ్వంత్ చవాన్ తెలిపారు. ఈ ఘటనతో బెంగళూరులోని అన్ని మెట్రో స్టేషన్లలోనూ, రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో భద్రత కట్టుదిట్టం చేశామని బెంగళూరు డీసీపీ రవి.డీ. చన్ననవార్ చెప్పారు.