ముక్కు పొడుగైందని వరుడికి హ్యాండ్ ఇచ్చిన పెళ్లికూతురు

ముక్కు పొడుగైందని వరుడికి హ్యాండ్ ఇచ్చిన పెళ్లికూతురు

Updated On : January 4, 2020 / 9:32 AM IST

ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మధ్య పెళ్లి మాటలు కుదిరాయి. ఇంకొద్ది రోజుల్లో ఒకటవ్వాల్సి ఉండగా ఫోన్ వచ్చింది. నీ ముక్కు పొడుగ్గా ఉంది.. ఈ పెళ్లి నాకొద్దని చెప్పేసింది ఆ యువతి. దీంతో కంగుతిన్న పెళ్లికొడుకు న్యాయం చేయాలంటూ పోలీసుల దగ్గరకు వెళితే చేతులెత్తేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. 

కోరమాంగళలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న (పేరు మారింది) రమేశ్(35).. ఓ మాట్రిమోనల్ వెబ్‌సైట్ ద్వారా రష్మీ(పేరు మారింది)ని ఆగష్టు మొదటివారంలో కలిశాడు. అమెరికాలో పనిచేస్తున్న యువతి పెళ్లి సంబంధం కోసం అతని ఇంటికే వచ్చి మాట్లాడింది. మాటలు కుదిరాయి. ఆ తర్వాత ఫోన్లో టచ్ లోనే ఉంటున్నారు. ఓ రోజు రష్మీ సోదరి లక్ష్మీని కలవాలని యువతి చెప్పడంతో రమేశ్ ఆగష్టు 13న కలిశాడు. 

కొద్ది రోజుల తర్వాత ఆగష్టు 26న ఇరు కుటుంబాల పేరెంట్స్ మాట్లాడుకుని సెప్టెంబరు 9న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి బెంగళూరులో చేయాలనుకుంటే కాదని తిరుపతిలో చేయాలని యువతి పేరెంట్స్ ఒత్తిడి చేశారు. ఈ నిర్ణయానికి ఒప్పుకుని బట్టలకు రూ.4లక్షలు, అతిథులు ఉండేందుకు 70గదుల కోసం రూ.1లక్ష ఖర్చు పెట్టాడు రమేశ్. 

2020 జనవరి 30న పెళ్లి ముహుర్తం ఖరారైంది. ఈ పనుల్లో బిజీగా ఉన్న అతనికి ఓ షాక్ తగిలింది. అక్టోబరు నెలలో యువతి నుంచి ఫోన్ వచ్చింది. రమేశ్ తండ్రితో వారికి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. షాక్ నుంచి కోలుకుని రమేశ్ యువతికి కాల్ చేశాడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పొడుగ్గా ఉన్న ముక్కును ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ఓకే అని చెప్పి పెట్టేసింది. 

పలుమార్లు చేసినా అదే సమాధానం వచ్చింది. కొన్నాళ్లకు నెంబర్ బ్లాక్ చేయడంతో పోలీసుల వద్దకు వెళ్లి తనకు అన్యాయం జరిగిందని.. మోసం చేశారంటూ కంప్లైంట్ చేశాడు. డిసెంబరు 31న కోరమాంగళ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 417, 420ల కింద ఫిర్యాదు చేశాడు. 

‘రష్మీ ఉద్దేశ్యపూర్వకంగా మోసం చేయాలనుకుంటేనే ఆమెపై యాక్షన్ తీసుకోగలం. అవమానించాలని, మోసం చేయాలని అనే ఉద్దేశ్యం కాకుండా ముక్కు పొడుగ్గా ఉందనే కారణంగానే పెళ్లికి వద్దంటే తామేం చేయలేమ’ని పోలీసులు చేతులెత్తేశారు.